గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్ భారీ స్కెచ్!
తెలంగాణలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమవుతోంది. త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వ పనితీరుకు పట్టభద్రుల తీర్పును మద్దతుగా మలచుకోవడంతో పాటు, రాబోయే రోజుల్లో రాజకీయ ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకత్వం పావులు కదుపుతోంది.
హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ తో పాటు నల్గొండ- వరంగల్- ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. ఈ ఉద్దేశంతో పార్టీ యంత్రాంగాన్ని ముందస్తుగా అప్రమత్తం చేసింది. మొత్తం 77 మందిని ఇన్చార్జ్లుగా నియమించి క్షేత్రస్థాయిలో గట్టి పట్టు సాధించేందుకు ప్రణాళిక రచించింది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ నియోజకవర్గానికి 43 మందిని, నల్గొండ- వరంగల్- ఖమ్మం స్థానానికి 34 మంది ఇన్చార్జ్లను కేటాయించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో ఆయా ఎమ్మెల్యేలకే ఆ బాధ్యతలు అప్పగించడం ద్వారా క్షేత్రస్థాయిలో నాయకత్వ సమన్వయ లోపం రాకుండా జాగ్రత్త పడ్డారు. ఎమ్మెల్యేలు లేని చోట ఎంపీలు, ఎమ్మెల్సీలకు పగ్గాలు అప్పగించారు. కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతను అనుముల తిరుపతిరెడ్డికి అప్పగించడం ద్వారా నాయకుల మధ్య జవాబుదారీతనం పెంచే ప్రయత్నం చేశారు.
ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, ఓటర్ల నమోదు ప్రక్రియ, క్షేత్రస్థాయిలో నేతల పనితీరుపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఎన్నికలను ఎవరూ తేలికగా తీసుకోవద్దని, మొదటి స్థానానికే పూర్తి ప్రాధాన్యం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. మంత్రులు సైతం ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని ఆదేశించడం ద్వారా ఈ ఎన్నికలను కాంగ్రెస్ ఎంత సీరియస్గా తీసుకుందో అర్ధం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలుపు ఓటములు ప్రధానంగా ఓటర్ల నమోదు ప్రక్రియపైనే ఆధారపడి ఉంటాయి. పట్టభద్రులు పెద్ద ఎత్తున ఓటర్లుగా పేరు నమోదు చేసుకునేలా చేయడం, అర్హులైన ప్రతి ఒక్కరినీ పోలింగ్ బూత్ వరకు రప్పించడం ప్రస్తుతం కాంగ్రెస్ ముందున్న ప్రధాన సవాల్. ఈ నేపథ్యంలోనే ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నియోజకవర్గాల వారీగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని నేతలను ఆదేశించారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడంతో, ప్రచార సమన్వయంపై ఇన్చార్జ్లు దృష్టిసారించారు.
ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు రాబోయే రాజకీయ పరిణామాలపై, ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయానికి అద్దం పడతాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. మేధావి వర్గంగా భావించే గ్రాడ్యుయేట్లు ఇచ్చే తీర్పు ప్రభుత్వానికి మరింత నైతిక బలాన్ని చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి.. అధికారంలో ఉన్న జోరును గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనూ ప్రదర్శించి క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్లో జోష్ నింపాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇన్చార్జ్ల నియామకం, సీఎం రేవంత్ స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి.








