తెలంగాణ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ.. రామచందర్ రావు వైపే మొగ్గు!
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను బీజేపీ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం అభ్యర్థుల ఎంపిక కోసం ప్రత్యేకంగా రెండు కమిటీలను రంగంలోకి దించింది. ఈ కమిటీలు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాయి. ఇందులో ఒక స్థానానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వైపే మెజారిటీ నేతలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ కేడర్ మూడ్‌ను అంచనా వేయడానికి బీజేపీ హైకమాండ్ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం విడివిడిగా రెండు కమిటీలను ఏర్పాటు చేసి మరీ కిందిస్థాయి అభిప్రాయాలను సేకరిస్తోంది. ముఖ్యంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఈ మూడు ఉమ్మడి జిల్లాల కీలక నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, గెలుపు గుర్రాల ఎంపికపై నేతలు తమ మనసులోని మాటను కమిటీ ముందుంచారు.
ఈ అభిప్రాయ సేకరణలో మెజారిటీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత ఎన్.రామచందర్ రావు వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే స్థానం నుండి ప్రాతినిధ్యం వహించిన అనుభవం, పట్టభద్రులలో ఉన్న మంచి పేరు, లాయర్‌గా ఆయనకున్న ప్రజా మద్దతును నాయకులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. చాలా మంది నేతలు ఆయన పేరును మాత్రమే ప్రధానంగా సూచించినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన నాయకుడికి మళ్లీ అవకాశం ఇస్తే గెలుపు మరింత సులభమవుతుందని కేడర్ గట్టిగా భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు.. అభిప్రాయ సేకరణలో అందరూ ఏకాభిప్రాయంతో లేరని సమాచారం. కొంతమంది నాయకులు మాత్రం “పార్టీ అధిష్ఠానం ఎవరికి టికెట్ కేటాయించినా మాకు అభ్యంతరం లేదు, పార్టీ నిర్ణయమే శిరోధార్యం” అని స్పష్టం చేశారు. మరికొంత మంది మాత్రం ఒకవేళ రామచందర్ రావు కాకపోతే పలానా వ్యక్తికి అవకాశం ఇవ్వాలని ప్రత్యామ్నాయ అభ్యర్థుల పేర్లను సూచించారు. అయితే ఇలా సూచించిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఏది ఏమైనప్పటికీ, మెజారిటీ నాయకుల మద్దతు రామచందర్ రావు వైపు ఉండటంతో బీజేపీ వర్గాల్లో ఆయన పేరే ప్రధానంగా వినిపిస్తోంది. అభిప్రాయ సేకరణ కమిటీలు సేకరించిన ఈ నివేదికను త్వరలోనే రాష్ట్ర నాయకత్వం ద్వారా కేంద్ర పార్టీ అధిష్ఠానానికి నివేదించనున్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న తరుణంలో, అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.








