రాజ్యాంగ పరిరక్షణే థ్యేయం.. హస్తిన వీధుల్లో విపక్ష పోరాటం..
విపక్ష ఇండీ కూటమి ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లుతోంది. వేలాది మంది విపక్ష పార్టీలకు చెందిన నేతలు, సామాజిక సంస్థలు, విద్యార్థి సంఘాలు.. ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఓట్ చోరీ జరిగిందని.. దానికి ప్రధాని మోడీ, అమిత్ షా.. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ సూత్రధారులని ఆరోపించాయి. మోడీ వ్యూహకర్త కాగా.. దాన్ని అమలు చేస్తోంది అమిత్ షా అని.. వీరికి ఈసీ సహకరిస్తున్నారని ఆరోపించారు ఇండీకూటమి నేతలు..
దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఐక్యంగా పోరాడతామని విపక్ష ‘ఇండియా’ కూటమి (INDIA Alliance), పౌరసంఘాలు ప్రతిజ్ఞ చేశాయి. ఈ విషయంలో రాజకీయ, ప్రజా ప్రతిఘటన కొనసాగుతుందని.. కచ్చితంగా విజయం సాధిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో ‘ఇండియా’ కూటమి నేతలు, విద్యార్థి, పౌర సంఘాల సభ్యులతో సమావేశమైన రాహుల్.. వారికి తేనీటి విందు ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఓటు చోరీకి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు.
‘‘సుప్రీంకోర్టు, సీజేఐ, న్యాయ వ్యవస్థపై మాకు అత్యంత గౌరవం ఉంది. తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తాయని ఆశిస్తున్నాం. విజయం సాధించేవరకు రాజకీయ, ప్రజాపోరాటం కొనసాగుతుంది. రాజ్యాంగాన్ని దెబ్బతీసి ఎవరూ తప్పించుకోలేరు. ఓట్ల చోరీకి పాల్పడిన వారిని విడిచిపెట్టబోం. ప్రధాని మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ తదితరుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. సోమవారం సుప్రీంకోర్టుకు నిర్వహించిన ర్యాలీలో కనిపించిన దృశ్యం కేవలం పార్టీల ప్రదర్శన కాదు. అది దేశ ప్రజల గొంతుక. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ఈ పోరాటంలో వేర్వేరు నిరసనలంటూ ఏమీ లేవు. అంతా ఏకతాటిపై ఉన్నాం’’ అని రాహుల్ పేర్కొన్నారు.
అయితే వీరివాదనను అధికార ఎన్డీఏ కూటమి అంగీకరించడం లేదు. గతంలో కాంగ్రెస్ గెల్చిన రాష్ట్రాల మాటేంటని ప్రశ్నిస్తోంది. అంతేకాదు.. కాంగ్రెస్ గత చరిత్ర ఏంటని నిలదీస్తోంది. అంతేకాదు… నిరసనలకు జంతర్ మంతర్ ప్రాంతం సరికాదని.. దాన్ని వేరే చోటుకు మార్చాలని యోచిస్తోంది. దీన్ని విపక్ష కూటమి నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా రాజకీయ పోరాటం కాస్తా.. వీధుల్లో బలప్రదర్శనగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.








