సింగరేణిలో వేడెక్కుతున్న రాజకీయం..!
తెలంగాణలో ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలకు నగారా మోగనుంది. అయితే ఈ లోపే సింగరేణి కాలరీస్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు రాజకీయ పార్టీలను అప్రమత్తం చేశాయి. వేలాది మంది కార్మికుల కుటుంబాలు సింగరేణి ఆధారంగా పనిచేస్తున్నారు. ఇలాంటి ఎన్నికల్లో గెలవడం ద్వారా సత్తా చాటాలని రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
సింగరేణి సంస్థలో సుమారు 40 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కోల్బెల్ట్ ప్రాంతం దాదాపు 13 అసెంబ్లీ స్థానాల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడి కార్మికులు, వారి కుటుంబాల ప్రభావం ఎన్నికల ఫలితాలపై గట్టిగా ఉంటుంది. అందుకే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. గతం నుంచి కూడా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన పార్టీనే ఆయా ప్రాంతాల్లో రాజకీయంగా పైచేయి సాధిస్తుందనే బలమైన నమ్మకం రాజకీయ వర్గాల్లో ఉంది.
గతంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్దికాలానికే యూనియన్ ఎన్నికలు జరుగాయి. అయితే ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మారాయి. నవంబర్ లేదా డిసెంబర్ నాటికి ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయస్థానంలో వివిధ సంఘాలు వేసిన పిటిషన్లపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వ వైఖరి, కోర్టు ఉత్తర్వుల ఆధారంగా ఎన్నికల షడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. అందుకే కార్మిక సంఘాలు, రాజకీయ పక్షాలు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాయి.
ఎన్నికలు రాబోతున్నాయన్న సంకేతాలు రావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు కార్మికులను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ సంక్షేమ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. కార్మికుల ఓట్లను రాబట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ చర్యలపై దృష్టి సారించింది. కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలు, గృహ నిర్మాణాలు, పెండింగ్లో ఉన్న సింగరేణి ఇళ్ల పట్టాల సమస్యల పరిష్కారం వంటి హామీలతో కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దసరా పండగవేళ ప్రకటించిన భారీ బోనస్ కూడా తమకు కలిసొస్తుందని నమ్ముతోంది.
ఇక.. ప్రతిపక్ష బీఆర్ఎస్ దూకుడు మీదుంది. గల్ఫ్, కోల్బెల్ట్ ప్రాంతాల్లో తమకు మంచి పట్టు ఉందని ఆ పార్టీ నమ్ముతోంది. దాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే అనుబంధ సంఘం అయిన టీబీజీకేఎస్ (TBGKS) ఆధ్వర్యంలో కార్మిక గర్జనలు, బహిరంగ సభలను నిర్వహిస్తోంది. ఇవాళ చలో సింగరేణికి పిలుపునిచ్చిన ఆ పార్టీ… సింగరేణి సంస్థలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వంపై ఎక్కుపెడుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్లతో పాటు బీజేపీ అనుబంధ సంఘాలు అలాగే లెఫ్ట్ పార్టీల అనుబంధ యూనియన్లు కూడా క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. కార్మికుల సమస్యలపై గళం విప్పుతున్నాయి. మంచిర్యాల, చెన్నూరు, రామగుండం వంటి కోల్బెల్ట్ ప్రాంతాలు ప్రధాన రాజకీయ పార్టీల కార్యకలాపాలతో హోరెత్తుతున్నాయి.
గతంలో సింగరేణి ప్రాంతంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన శక్తులు నేడు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కేవలం వేతన ఒప్పందాలు, బోనస్లు మాత్రమే కాకుండా కార్మికుల సర్వతోముఖాభివృద్ధి, ఉద్యోగ భద్రత, జీవన ప్రమానాల మెరుగుదల ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారుతున్నాయి. రాబోయే రోజుల్లో రానున్న సింగరేణి ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో రాబోయే పరిణామాలకు ఒక దిక్సూచిగా నిలవనున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.








