కాంగ్రెస్ నిరుద్యోగ అస్త్రం.. విజయమే లక్ష్యం!
తెలంగాణలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్, వరంగల్- ఖమ్మం- నల్గొండ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా రాజకీయంగా బలమైన సందేశం ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షాలు అభ్యర్థుల ఎంపికలో తర్జనభర్జన పడుతుండగా, కాంగ్రెస్ మాత్రం ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలో దూసుకెళ్తోంది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ స్థానానికి సామా రామ్మోహన్ రెడ్డి, వరంగల్- ఖమ్మం- నల్గొండ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలను అభ్యర్థులుగా ఖరారు చేసి ప్రచారంలో ముందంజలో నిలిచింది.
యువత, నిరుద్యోగులే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనాపరమైన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, తమ హయాంలో ఉద్యోగాల భర్తీకి ఇస్తున్న ప్రాధాన్యతను విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తమ హయాంలో ఇప్పటికే 70 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని, రాబోయే రెండు సంవత్సరాలలో మరో 1.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అలాగే గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో గ్రూప్-1 నియామకాలు, కేవలం రెండు నెలల వ్యవధిలోనే 10 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ ప్రక్రియను విజయవంతం చేశామని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ఈ గణాంకాలే గ్రాడ్యుయేట్ ఓటర్లను తమ వైపు తిప్పుకుంటాయని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోంది.
ఎన్నికల్లో కేవలం వాగ్దానాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం భారీ వ్యూహాన్ని రచించింది. ఇందులో భాగంగా ఎన్నికల సమన్వయం కోసం ఏకంగా 77 మంది సీనియర్ నేతలను పరిశీలకులుగా నియమించింది. ఈ జాబితాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం, పట్టభద్రులతో ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలకు ప్లాన్ చేశారు. పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగ కల్పనపై ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అత్యంత సీరియస్గా తీసుకున్న మరో అంశం ‘జవాబుదారీతనం’. ఎన్నికల బాధ్యతలను ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక కేడర్కు అప్పగించారు. ఫలితాల బాధ్యత కూడా వారిదేనని, ఓటమిపాలైతే దానికి ప్రజాప్రతినిధులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ముందస్తు ప్రణాళికలు, అభ్యర్థుల ప్రకటనలో దక్కిన ఆధిపత్యం, పకడ్బందీ సంస్థాగత నిర్మాణం ద్వారా ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను సులువుగా గెలుచుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, గ్రాడ్యుయేట్ ఓటర్ల నాడిని పట్టుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ఈ ప్రయత్నాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.








