లద్దాఖ్ భారత్ లో అంతర్భాగం..చైనాకు కేంద్రం కౌంటర్..
భారత భూభాగాలపై కన్నేసిన చైనా ప్రభుత్వం.. ఆయా ప్రాంతాలకు అధికారిక పేర్లు ఖరారు చేయడంపై సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మీదేశంలోని భూభాగాలు మావి.. వాటికి మీరు పేర్లు పెట్టడం సరికాదు.. మీరు పేర్లు పెట్టినా , వాటిని గుర్తించబోమంటోంది. ఈవైఖరిని భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తున్నా.. డ్రాగన్ తీరు మారడం లేదు. లేటెస్టుగా లద్దాఖ్ లోని 28 వ్యూహాత్మక ప్రాంతాలకు ఇండియా పేర్లు పెట్టడంపై చైనా అభ్యంతరం తెలిపింది. దీనికి కేంద్రం కూడా గట్టి కౌంటరిచ్చింది. లద్దాఖ్ భారత్లో విడదీయరాని అంతర్భాగమని, చైనా ఆరోపణలు ఈ వాస్తవాన్ని మార్చలేవని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, లడఖ్ యంత్రాంగంతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. శిఖరాలు, కనుమలు, జలవనరులతో సహా మొత్తం 28 ప్రదేశాలకు ప్రామాణిక పేర్లను నిర్ణయించి, వాటిని సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్లో చేర్చనున్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాలకు సంబంధించి స్పష్టమైన గుర్తింపు, అవగాహన పెరుగుతుందని విదేశాంగ శాఖ ప్రకటించింది.
తన భౌగోళిక రికార్డులను పటిష్ఠం చేసుకునేందుకే భారత్ ఈ చర్యలు చేపట్టింది. దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందిస్తూ, భారత్ ఏకపక్షంగా ఏర్పాటు చేసిన ‘కేంద్రపాలిత ప్రాంతం లడఖ్’ను తాము ఎన్నడూ గుర్తించలేదని వ్యాఖ్యానించారు. “భారత్ ప్రకటించిన ప్రామాణిక పేర్లను మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ చర్య చట్టవిరుద్ధం, చెల్లదు. చైనా-భారత్ సరిహద్దులోని పశ్చిమ సెక్టార్లోని ఆ ప్రాంతాలు ఎల్లప్పుడూ చైనా భూభాగాలే” అని ఆమె వాదించారు.
చైనా వాదనలను భారత్ తీవ్రంగా ఖండించింది. “కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్ .. భారత్లో విడదీయరాని అంతర్భాగం. ఈ సుస్థిర వాస్తవాన్ని చైనా ఎంతగా వ్యతిరేకించినా మార్చలేదు” అని విదేశాంగ శాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది.








