రష్యాతో డీజిల్ డీల్ పై విమర్శల హోరు… ప్రపంచం కోసమే అంటున్న ట్రంప్..
రష్యాతో భారీ డీజిల్ కుదుర్చుకున్న అమెరికా అధినేత ట్రంప్… ఇది గొప్ప విజయమన్నారు. అంతేనా.. ఈ డీల్ కారణంగా ప్రపంచంలో మార్కెట్లకు ఇబ్బందులు తప్పుతాయన్నారు. దీనికితోడు ఈ డీల్ కారణంగా .. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కాస్త సడలుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఈడీల్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది తమకు పూర్తిగా శరాఘాతమన్నారు ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ. దీంతో రష్యా తమపై మరింత బలంగా దాడులు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు…డీజిల్ కొనుగోళ్ల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సొంత పార్టీ నుంచి కూడా తీవ్ర విమర్శల సెగ ఎదురవుతోంది (Russian diesel). ఈ నేపథ్యంలో ఆయన కాస్త వెనక్కి తగ్గారు. ఈ డీల్ అమెరికా కోసం కాదని.. ప్రపంచ మార్కెట్ల కోసమని చిత్రమైన వివరణ ఇచ్చారు.
‘‘అదొక డీజిల్ ఒప్పందం. అది మనకోసం కాదు.. ప్రపంచం కోసం’’ అని ట్రంప్ (Donald Trump) సమర్థించుకున్నారు. అధిక ధరల కారణంగా దెబ్బతిన్న ప్రపంచ మార్కెట్‌ను స్థిరీకరించడానికే రష్యాలోని రిఫైనరీల నుంచి వచ్చిన ఇంధనాన్ని ఉపయోగించనున్నట్లు చెప్పారు. నవంబరులో మధ్యంతర ఎన్నికల వేళ ఇంధన ధరల పెరుగుదల అమెరికా (USA) లో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో కొన్నిరోజుల క్రితం ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రష్యా డీజిల్‌పై ఆంక్షలను 2027 ఏప్రిల్ వరకు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచం షాక్‌కు గురైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఇటీవల ఫోన్లో చర్చలు జరిపిన అనంతరం ఆ ప్రకటన చేశారు.
తొలుత మూడు లక్షల టన్నులకుపైగా డీజిల్‌ను అమెరికాకు, అంతర్జాతీయ విపణికి రష్యా తక్షణమే సరఫరా చేసేలా తమ చర్చల్లో ఒప్పందం కుదిరిందన్నారు. నవంబరులో మరో 5 లక్షల టన్నులు.. ఆ తర్వాత వెంటనే ఇంకో 10 లక్షల టన్నులను మాస్కో సరఫరా చేస్తుందన్నారు. ఆపై ఆ దేశ డీజిల్ రిఫైనరీల పరిస్థితులను బట్టి స్వల్ప కాలంలోనే మరో 30 లక్షల టన్నుల వరకూ అందిస్తుందని తెలిపారు.








