హుతీల దాడులతో వణుకుతున్న సౌదీ అరేబియా..!
హుతీలు విజృంభిస్తున్నారు. ఇరాన్ సాయంతో సౌదీ అరేబియాపై మిస్సైల్స్ వర్షం కురిపిస్తున్నారు.
లేటెస్టుగా చమురు దిగ్గజం అరాంకో(Aramco) ప్రధాన కార్యాలయంపై హూతీలు(Houthis) బాలిస్టిక్ క్షిపణితో దాడి చేశారు. మరోవైపు రాజధాని రియాద్(Riyadh)లో క్షిపణుల శకలాలు పడటంతో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు, ఓ చిన్నారి ఉన్నారు. ఈ ఘటనలో 15 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. సౌదీ అరేబియాలోని కీలక ప్రాంతాలపై దాడులు జరగడంతో భద్రతాపరమైన ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియా మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. హూతీలు క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో సౌదీ బలగాలు వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో క్షిపణి ఇంటర్సెప్టర్లను ప్రయోగిస్తుండటంతో.. వాటి శకలాలు కిందపడి ఇళ్లకు నష్టం వాటిల్లుతోంది.
ఇవి కూడా చదవండి
యెమెన్ ఇంధన కేంద్రంపై సౌదీ దాడి
యెమెన్(Yemen) లోని హూతీ తిరుగుబాటుదారులకు చెందిన కీలక ఇంధన కేంద్రంపై సౌదీ అరేబియా(Saudi Arabia) దాడి చేసింది. రాజధాని సనా శివార్లలోని అల్-సబాహా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి పాల్పడింది. హూతీలు సౌదీలోని విమానాశ్రయాలు, ఇంధన సముదాయాలపై దాడులకు ఈ కేంద్రాన్ని వాడుతున్నట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు తెలిపాయి. ఈ కేంద్రంలో సుమారు 58 వేల టన్నుల ఇంధనాన్ని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు హూతీలు వెల్లడించారు. ఈ వరుస దాడుల నేపథ్యంలో హౌతీలు, సౌదీ బలగాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.








