తీవ్ర విద్యుత్ సంక్షోభం అంచున అమెరికా..!
అమెరికాపై విద్యుత్ పిడుగు పడనుందా.. తీవ్ర సంక్షోభంలో అమెరికా కూరుకుపోనుందా.. ప్రస్తుతం పరిస్థితి చూస్తే అదే అనిపిస్తోంది. దేశంలోనే అతిపెద్ద విద్యుత్ గ్రిడ్ ఆపరేటర్ అయిన పీజేఎం పరిధిలోని 13 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీలో బ్లాక్అవుట్లు సంభవించే ప్రమాదం ఏర్పడింది. దీంతో అమెరికా ఇంధన శాఖ వెంటనే రంగంలోకి దిగి, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా చూసేందుకు అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ద్వారా సుమారు 6.5 కోట్ల మంది ప్రజలకు విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది.
మెయింటెనెన్స్ లో భాగంగా..
శరదృతువులో అనూహ్యంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం, దీంతో విద్యుత్‌కు డిమాండ్ భారీగా పెరగడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణం. అదే సమయంలో, శీతాకాలానికి సన్నద్ధమయ్యే క్రమంలో అనేక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ప్రణాళికాబద్ధమైన నిర్వహణ (మెయింటెనెన్స్) పనుల కోసం మూతపడ్డాయి. దీనికి తోడు, ట్రాన్స్మిషన్ లైన్లలో కూడా మరమ్మతులు జరుగుతుండటంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విద్యుత్ బదిలీపై పరిమితులు ఏర్పడ్డాయి. ఈ కారణాల వల్ల విద్యుత్ వ్యవస్థ రిజర్వ్ మార్జిన్‌కు దగ్గరగా పనిచేస్తుండటంతో గ్రిడ్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా మేరీల్యాండ్, వర్జీనియా, నార్త్ కరోలినా, వాషింగ్టన్ మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని భావించింది. దీంతో అప్రమత్తమైన పీజేఎం, గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడేందుకు అదనపు అధికారాలు కావాలని అక్టోబర్ 11న ఇంధన శాఖను అభ్యర్థించింది.
ప్రభుత్వం తీసుకున్న చర్యలు
పీజేఎం అభ్యర్థన మేరకు, అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ ఫెడరల్ పవర్ యాక్ట్‌లోని సెక్షన్ 202(సి) కింద అక్టోబర్ 12న అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 13 నుంచి 16 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం, గ్రిడ్ స్థిరత్వం కోసం అవసరమైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను వెంటనే ఆపరేట్ చేసే అధికారం పీజేఎంకు లభించింది.
ఒకవేళ పరిస్థితి మరింత దిగజారితే, చివరి ప్రయత్నంగా డేటా సెంటర్లు, భారీ వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల వద్ద ఉన్న బ్యాకప్ జనరేటర్లు, స్టాండ్‌బై యూనిట్లు, బ్యాటరీ స్టోరేజ్ వంటి ప్రత్యామ్నాయ వనరులను కూడా వాడుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇవి కేవలం ముందు జాగ్రత్త చర్యలేనని, నిర్బంధ విద్యుత్ కోతలను (లోడ్ షెడ్డింగ్) నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.








