సౌదీ-హుతీల మధ్య యుద్ధానికి కారణాలేంటి..?
యెమెన్ అంతర్యుద్ధం కాస్తా సౌదీ అరేబియా, హుతీల మధ్య యుద్ధంగా ఎందుకు పరిణమించింది. గల్ఫ్‌లో చాలా దేశాలున్నా.. సౌదీనే ఎందుకు హుతీలు టార్గెట్ చేసుకున్నారు.దీని వెనక 11 ఏళ్ల చరిత్ర ఉంది. నాడు సౌదీ తీసుకున్న ఓ ముందుచూపు లేని చర్య.. ఇప్పుడు ఆ దేశాన్ని వణికిస్తోంది.. సౌదీ అరేబియా విమానాశ్రయాలతోపాటు ప్రధాన నగరాలపై దాడులు చేస్తున్న హూతీలు బీభత్సం సృష్టిస్తున్నారు. దీంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది.
సౌదీ అరేబియా దక్షిణ సరిహద్దుల్లో యెమెన్ ఉంటుంది. ఇరాన్ మద్దతుతో హుతీలు బలపడుతూ క్రమంగా యెమెన్‌పై పట్టు సాధిస్తుండటంతో పొరుగు నుంచి ప్రమాదం పొంచి ఉంటుందని భావించిన సౌదీ అరేబియా 2015లో హుతీలపై దాడులను ప్రారంభించింది.హుతీ గ్రూపును విచ్ఛిన్నం చేసి, యెమెన్ ప్రభుత్వాన్ని బలోపేతం చేసి, ప్రపంచంలోనే అతి పెద్ద మానవతా సంక్షోభాన్ని పరిష్కరించాలని భావించిన సౌదీ అరేబియా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సాయంతో వైమానిక దాడులు చేసింది. ఆ దాడులు ఫలితమివ్వలేదు. వాయవ్యంలోని పర్వత ప్రాంతాల్లో హూతీలు మరింత పట్టు బిగించారు. యెమెన్‌లోని ఎక్కువ జనాభా ఈ ప్రాంతంలోనే ఉంటుంది.
సుదీర్గ పోరాటం తర్వాత.. 2022లో సౌదీకి, హూతీలకు మధ్య శాంతికి ఐక్యరాజ్య సమితి ఒప్పందం కుదిర్చింది. దీంతో శాంతి నెలకొంది. దాడులు ఆగిపోయాయి.2023లో గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఎర్ర సముద్రంలో హూతీలు మళ్లీ దాడులకు దిగారు. ఇజ్రాయెల్‌ను దిగ్బంధించడం కోసం ఈ దాడులు చేస్తున్నామని ప్రకటించారు. ప్రతిగా 2024, 2025లలో హూతీలపై వైమానిక దాడులతో అమెరికా విరుచుకుపడింది. 1,000 లక్ష్యాలపై 2,000 బాంబులు వేసింది.
ఇరాన్‌పై యుద్ధంతో తీవ్రం
పశ్చిమాసియాలో మొదలైన ఇరాన్ యుద్ధంతో హూతీలు మరింతగా రెచ్చిపోయారు. యెమెన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత వేసవిలో వారు దాడులను తీవ్రతరం చేశారు. యెమెనీ రాజధాని సనాను సౌదీ అరేబియా దిగ్బంధించడంతో తాము ఆ దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటామని గత జులైలో హూతీలు ప్రకటించారు. అన్నట్లుగానే ఎర్ర సముద్రంలో నౌకా రవాణాపై దాడులకు దిగారు. ఆ తర్వాత సౌదీలోని మౌలిక వసతులపై, చమురు రిఫైనరీలపై దాడులు చేశారు. గత నెలలో హూతీలు యెమెన్ ఎర్ర సముద్ర తీరంలోని మోచా పోర్టును ఆక్రమించారు. దీంతోపాటు దేశంలోని మూడో పెద్ద నగరమైన తైజ్ దిశగా దూసుకొస్తున్నారు. సౌదీ మద్దతున్న ప్రభుత్వం.. ఎడెన్ నుంచి హూతీలపై భారీగా దాడులకు దిగినా ఫలితం లేకపోయింది.
డ్రోన్లను తయారుచేసుకునే ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకోవడానికి హుతీలకు ఇరాన్ సాయం అందించింది.
లెబనాన్‌లోని హెజ్బొల్లా కూడా హుతీలకు ఆయుధ సాయం అందిస్తోంది.హుతీల వద్ద ఇరాన్ సాయంతో సంపాదించుకున్న బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. హుతీలవద్ద ఉన్న ఆయుధాలు ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్‌లోని ఏ దేశాన్నైనా లక్ష్యంగా చేసుకోగలవు.
గత ఏడాది యెమెన్‌లోని రెబల్ వర్గాలకు యూఏఈ మద్దతుగా నిలిచింది. దీంతో ఆ దేశంతో సౌదీ అరేబియా సైనిక బంధాన్ని తెంచుకుంది. మరోవైపు అమెరికా భారీగా సైనిక సాయం చేస్తుందనుకున్న సౌదీ ఆశలు అడియాశలయ్యాయి.
హూతీలను అడ్డుకోవడానికి అంతర్జాతీయ సాయాన్ని సౌదీ కోరింది. ఫ్రాన్స్, బ్రిటన్, పాకిస్థాన్ సాయాన్ని అందించేందుకు అంగీకరించాయి. ఇరాన్ మద్దతున్న రెబల్స్‌ను అంతమొందించడంలో విజయం సాధించిన సిరియా ప్రభుత్వ సాయాన్ని సౌదీ అర్థించింది.








