హుతీ దాడులతో సౌదీ అలర్ట్.. యువరాజుకు పటిష్టభద్రత..
హుతీ తిరుగుబాటుదారుల దాడులతో సౌదీ అరేబియా ఠారెత్తుతోంది. ఓ ఉగ్రవాద సంస్థ నేరుగా ఓ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండడం.. దానికి గట్టిగానే బదులిస్తున్నా, వారిని అణచివేయడంలో విఫలం కావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. దీంతో తమ దేశాన్ని ఉగ్రవాద దాడుల నుంచి కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతోంది సౌదీ అరేబియా. దీనికోసం మక్కా ఢిఫెన్స్ డీల్ సైతం చేసుకుంది. అయితే అది అవసరానికి అక్కరకు రాకుండా పోయిన పరిస్థితి.. సౌదీని కలవరపరుస్తోంది.
హుతీల దాడుల యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భద్రతను కట్టుదిట్టం చేసింది సౌదీ. ప్రత్యేకంగా ఎంపిక చేసిన భద్రతా బృందం ఆయన్ను రక్షించేందుకు ఎప్పటికప్పుడు బంకర్లు, పటిష్ఠ భద్రత ఉన్న వేర్వేరు ప్యాలెస్‌లకు తరలిస్తోంది. అంతేకాదు… ఆయన భద్రతా సిబ్బందిగా.. అత్యంత నమ్మకస్తులు, విశేష రక్షణానుభవం ఉన్న అధికారులను నియమించింది.
సౌదీలోని విమానాశ్రయాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, నౌకామార్గాలే లక్ష్యంగా హూతీలు దాడులు చేస్తున్నారు. ఇటీవల రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో దాదాపు 13 మంది మృతి చెందగా.. 300 మందికిపైగా గాయపడ్డారు. అప్పటి నుంచి మహమ్మద్ బిన్ సల్మాన్‌కు అందిస్తోన్న భద్రతను మరింత పెంచారు. అలాగే బహిరంగ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.
గతవారం సౌదీలో రక్తదాన కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించడం లేదు. భద్రతా కారణాలరీత్యా ఆయన్ను ఒక రాజభవనం నుంచి మరొక రాజభవనం నుంచి తరలిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో కాపాడుతుందనుకున్న మిత్రదేశం అమెరికా చేయివ్వటం, మక్కా ఒప్పందం అక్కరకు రాకపోవడంతో సౌదీ పరిస్థితి ఇప్పుడు గందరగోళంగా మారింది.








