చంద్రబాబు ‘గివ్ అండ్ టేక్’ వ్యూహం.. తెలంగాణలో వ్యతిరేకత!
ఆంధ్రప్రదేశ్ విడిపోయి 12 ఏళ్లు దాటింది. అయిన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు మాత్రం ఇప్పటికీ అలాగే ఉండిపోయాయి. ఇవి నిత్యం రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. తాజాగా రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. అయితే, చంద్రబాబు ప్రతిపాదనపై తెలంగాణలో అనేక సందేహాలు, వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. చట్టబద్ధంగా రావాల్సిన వాటిని పక్కనపెట్టి, పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలనే చంద్రబాబు ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఇటీవల జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని ఉద్దేశించి చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి ఉమ్మడి రాష్ట్ర నాయకత్వం చొరవ చూపాలని ఆయన కోరారు. అయితే, దీనిని తెలంగాణ ప్రభుత్వం కేవలం కాలయాపన కార్యక్రమంగా చూస్తోంది. అంతేకాక, ఏపీకి అనుకూలంగా చట్టాన్ని మార్చే ప్రయత్నంగా అనుమానిస్తోంది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలను యథాతథంగా అమలు చేయాలని, లొకేషన్ ఆధారంగా ఆస్తుల విభజన జరగాలని తెలంగాణ మొదటి నుంచి స్పష్టం చేస్తోంది.
ఈ విభేదాల వెనుక బలమైన రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయి. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనలో, అలాగే చట్టంలో ప్రత్యేకంగా పేర్కొనని సంస్థల విషయంలో గతంలోనే తమకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు వచ్చాయని తెలంగాణ వాదిస్తోంది. ఇప్పుడు ‘గివ్ అండ్ టేక్’ పేరుతో వాటిని తప్పిస్తారని తెలంగాణ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు.. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులకు సంబంధించి పబ్లిక్ డెట్ విభజనలో జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలని విభజన చట్టం స్పష్టం చేసింది. అయితే.. ఏపీ మాత్రం లొకేషన్, యుటిలైజేషన్, జనాభా ప్రాతిపదికన వేర్వేరు పద్ధతులను ప్రతిపాదించిందని తెలంగాణ ఆరోపిస్తోంది.
ఈ వివాదం కేవలం అధికారుల స్థాయికే పరిమితం కాకుండా రాజకీయ వేడిని రాజేసింది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అనుకూలంగా ఏకపక్షంగా వ్యవహరించి, తెలంగాణ నుంచి రావాల్సిన మొత్తాన్ని రికవర్ చేయాలని ఆదేశించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. చట్ట నిబంధనలను దాటి ‘గివ్ అండ్ టేక్’ ముసుగులో ఏపీ ఆర్థికంగా లబ్ది పొందాలని చూస్తోందని తెలంగాణ గట్టిగా వాదిస్తోంది.
మొత్తంగా చూస్తే.. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ ఆధిపత్యం, ఆర్థిక ప్రయోజనాల సాధన కోసం ఈ విభజన అంశాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. చట్టం ప్రకారం హక్కులను కాపాడుకోవాలని తెలంగాణ భావిస్తోంది. అదే సమయంలో పరస్పర అంగీకార మార్గాలను అన్వేషించాలని ఏపీ ప్రతిపాదిస్తోంది. మరి ఈ ప్రతిష్టంభన రాబోయే రోజుల్లో ఏ రాజకీయ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.








