రాజకీయాలకు అతీతంగా.. రేవంత్ తెలంగాణ విజన్!
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంతో పాటు, రాష్ట్రాన్ని ఆర్థికంగా అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్- హైటెక్స్ వేదికగా జరిగిన ‘సమాఖ్య-2026’ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. కేవలం పారిశ్రామిక రంగానికే పరిమితం కాకుండా, రాష్ట్ర భవిష్యత్తును దిశానిర్దేశం చేసే రాజకీయ, ఆర్థిక ప్రణాళికను సీఎం ఆవిష్కరించారు. దేశ జీడీపీలో ప్రస్తుతం 5 శాతంగా ఉన్న తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. చార్మినార్ నుంచి హైటెక్ సిటీ వరకు చారిత్రక మైలురాళ్లను గుర్తు చేశారు. నూతన పారిశ్రామిక విధానంలో యువత, మహిళలు భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు.
2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం వెల్లడించారు. ఈ లక్ష్య సాధన కోసం రాష్ట్రాన్ని మూడు విభిన్న ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ- క్యూర్ పరిధిలోని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని ఐటీ, అత్యాధునిక టెక్నాలజీ, సేవా రంగాలు మరియు ఆవిష్కరణలకు కేంద్రంగా మలుస్తున్నారు. ప్యూర్ అర్బన్ రీజియన్ ఎకానమీ- ప్యూర్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని తయారీ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి చేస్తున్నారు. రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ- రేర్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మహిళల భాగస్వామ్యం ఉన్న దేశాలు ఆర్థికంగా బలపడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. తెలంగాణలో మహిళలకు 61 వేల కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలు అందించడం, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లలో మహిళలను యజమానులుగా మార్చడం ద్వారా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారానే నిజమైన సమగ్ర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఈ సదస్సు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండాలని, అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నిర్దేశించిన 2047 ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా, రాష్ట్రాల సహకారంతోనే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే 2025లో ‘తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్’ను విడుదల చేసినట్లు గుర్తు చేశారు.
కొత్తతరం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో సమాఖ్యల పాత్ర అత్యంత కీలకమని సీఎం స్పష్టం చేశారు. సినిమా, రాజకీయ రంగాలలో మున్నూరు కాపు సామాజికవర్గం అందించిన సేవలను ఆయన కొనియాడారు. కేవలం సర్వీస్ సెక్టార్కే పరిమితం కాకుండా, మన ప్రాంత యువత గ్లోబల్ స్థాయికి ఎదగాలనే ఆకాంక్షను ఈ సదస్సు స్పష్టం చేసింది. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా అగ్రస్థానంలో నిలపడమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి సర్కార్ దూసుకుపోతున్న తీరు రాబోయే కాలంలో తెలంగాణ రూపురేఖలను పూర్తిగా మార్చనుందనడంలో సందేహం లేదు.








