2028లో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి కమలా హారిస్?
అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ 2028 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసే ఆలోచనలో ఉన్నప్పటికీ, ఆమె భర్త డగ్ ఎమ్హాఫ్ వ్యక్తిగతంగా కొన్ని సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, హారిస్ మళ్లీ అధ్యక్ష బరిలోకి దిగకపోవడమే మంచిదని ఆయన సన్నిహితుల వద్ద అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఆమె నిర్ణయం తీసుకుంటే ఆయన పూర్తిగా మద్దతునిస్తారని భావిస్తున్నారు. మరోవైపు, డెమోక్రటిక్ పార్టీకి చెందిన కొందరు దాతలు కూడా ఆమెకు నామినేషన్ దక్కే అవకాశాలపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు 2028 ఎన్నికల కోసం కొత్త అభ్యర్థిని పరిశీలించాలని కోరుతున్నారు.
గతంలో జరిగిన రాజకీయ దాడులు, బహిరంగ విమర్శలు తమ వైవాహిక జీవితంపై చూపిన ప్రభావం గురించి కమలా హారిస్ తన ‘107 డేస్’ జ్ఞాపకాల్లో ప్రస్తావించారు. వాషింగ్టన్ వీడిన తర్వాత డగ్ ఎమ్హాఫ్ లాస్ ఏంజిల్స్లో తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించగా, ఈ దంపతులు మాలిబులో కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. ఈ వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నప్పటికీ, కమలా హారిస్ రాజకీయంగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. నవంబర్ మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో విస్కాన్సిన్, నెవాడా, జార్జియా వంటి రాష్ట్రాల్లో డెమోక్రటిక్ అభ్య్రధుల తరఫున ప్రచారం చేయడానికి, విరాళాల సేకరణ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆమె సిద్ధమవుతున్నారు. కాండీస్ బాండ్, ఎడ్వర్డో నెగ్రాన్ వంటి సలహాదారులతో ఆమె తన రాజకీయ బృందాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు.
2028 డెమోక్రటిక్ అభ్యర్థిత్వ రేసులో ఉన్న కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ మాత్రం, ఒకవేళ కమలా హారిస్ పోటీలోకి దిగితే తాను రేసులో ఉండబోనని స్పష్టం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా నల్లజాతీయుల మహిళల నుంచి ఆమెకు బలమైన మద్దతు లభిస్తుండగా, ప్రస్తుతం ఆమె నవంబర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థుల విజయానికి సహకరించడంపైనే పూర్తి దృష్టి పెట్టారని రాజకీయ వ్యూహకర్త డొన్నా బ్రేజిల్ తెలిపారు.








