సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఆశ’ డిజిటల్ ప్రీమియర్ అప్పుడే… ఏ ఓటీటీలో అంటే?
దిగ్గజ నటి ఉర్వశి ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ఆశ(Aasha) డిజిటల్ ప్రీమియర్ను జీ5(ZEE5) ప్రకటించింది. నూతన దర్శకుడు సఫర్ సనల్ దర్శకత్వం వహించగా, వినాయక్ అజిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, విజయరాఘవన్, లక్ష్మి మీనన్, భాగ్యలక్ష్మి, అజయన్ అడత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గత సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, అక్టోబర్ 16, 2026 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు హిందీ, తమిళం, తెలుగు , కన్నడ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లు అందుబాటులో ఉండనున్నాయి.
కథా నేపథ్యం…
తన కూతుళ్లను కాపాడుకోవడానికి తపించే తల్లి ఆశ జీవితం, ఒక రోడ్డు ప్రమాదం కారణంగా జీజు జార్జ్ పోషించిన ‘జీమోన్’ పాత్రతో ఏ విధంగా ఘర్షణకు దారితీసిందనేదే ఈ చిత్ర కథాంశం. ఒక చిన్న సంఘటన అందరి జీవితాలను ఎలా మార్చివేసింది, భయం, అహంకారం, కోపం వంటి భావాలు ఎదురైనప్పుడు మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందనే అంశాలను ఈ చిత్రంలో ఆవిష్కరించారు. ప్రతీకార కథల జోలికి వెళ్లకుండా, బటర్ఫ్లై ఎఫెక్ట్ ఆధారంగా చిన్న నిర్ణయాలు కూడా భారీ పరిణామాలకు ఎలా దారితీస్తాయనే కోణంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు…
ప్రధాన తారాగణం: ఉర్వశి, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, విజయరాఘవన్, లక్ష్మి మీనన్, భాగ్యలక్ష్మి
దర్శకత్వం: సఫర్ సనల్.
నిర్మాత: వినాయక్ అజిత్.
విడుదల తేదీ: అక్టోబర్ 16, 2026.
స్ట్రీమింగ్ వేదిక: జీ5 (మలయాళం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో).
కుటుంబం కోసం ఒక తల్లి ఎంత దూరం వెళ్ళగలదో తెలిపే ఈ మానసిక ఉత్కంఠభరిత థ్రిల్లర్ను అక్టోబర్ 16 నుంచి జీ5లో వీక్షించవచ్చు.







