రెండు భాగాలుగా కరీకాల.. సరికొత్త అవతారంలో సందీప్ కిషన్!
తెలుగు తెరపై సోషియో ఫాంటసీ కథలకు సరికొత్త రూపునిచ్చే ప్రయత్నంలో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రెడీ అవుతోంది. సందీప్ కిషన్(Sundeep kishan) హీరోగా నటిస్తున్న సినిమా కరీకాల. డైరెక్టర్ ఉగంధర్ ముని(Ugandhar Muni) తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంప్రదాయ జానపద కథల్లోని అద్భుతాలను ఆధునిక సాంకేతికతతో మేళవిస్తూ ఆడియన్స్ ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతోంది. తాజాగా సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్(Shining pictures banner)పై మహీధర్ రెడ్డి(mahidhar reddy), రాజశేఖర్ అన్నభిమోజు(Rajasekhar annabhimoju) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే రిలీజైన టైటిల్ పోస్టర్తో పాటు ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇందులో సందీప్ కిషన్ యోధుడి తరహా శక్తిమంతమైన అవతారంలో కనిపిస్తున్నారు. కేథరిన్ ట్రెసా(Catherine thressa), సాక్షి మడోల్కర్(Sakshi madolkar), గాయత్రి భరద్వాజ్(Gayatri bharadwaj) హీరోయిన్లుగా నటిస్తున్నారు. పురాతన రాజ్యాలు, మర్మమైన శక్తులు, వింత జీవులు, మరుగునపడిన గాథలతో కూడిన విభిన్న ప్రపంచాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుంది. చిన్ననాటి చందమామ కథల్లో కనిపించే ఊహాజనిత అంశాలను భారీ స్థాయి విజువల్స్తో తెరపైకి తీసుకురావడం ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీగా నిలవనుంది.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న కరీకాల(karikaala)ను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ చేశారు. తొలి భాగం 2027 జూలై 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, రెండో భాగాన్ని అదే ఏడాది అక్టోబర్ 28న రిలీజ్ చేయనున్నారు. శంభాల(sambhala) సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఉగంధర్ ముని ఈసారి మరింత విస్తృతమైన కథా ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఫాంటసీ, సాహసం, సామాజిక అంశాల కలయికగా రూపొందుతున్న ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్లో ప్రత్యేకమైన ప్రయోగంగా నిలుస్తుందేమో చూడాలి.








