విమానంలో నల్లుల దండయాత్ర.. ఫ్లైట్ ఆపేసి మరీ వెతుకులాట!
ఒకప్పుడు సినిమా థియేటర్ల సీట్లలో కనిపించేవి.. మడత మంచాల సందుల్లో మకాం వేసేవి.. రాత్రిపూట కంటిమీద కునుకు లేకుండా చేసి, తెల్లారేసరికి ఒంటిపై తమ ఉనికిని చాటిచెప్పేవి నల్లులు! ఈ మధ్య వాటి హడావుడి కాస్త తగ్గింది. ఆ జాతి అంతరించిపోతోందేమోనని అనుకుంటున్న సమయంలో.. ఇదిగో ఈ వార్త నల్లుల అభిమానులు (ఉంటే గింటే!) పండగ చేసుకునేలా ఉంది. ఎందుకంటే, ఈసారి వాటి ప్రయాణం మామూలుగా లేదు. థియేటర్ నుంచి విమానానికి కాదు.. ఏకంగా అంతర్జాతీయ విమానంలో ఎకానమీ క్లాస్ వరకు వెళ్లిపోయాయి!
ఆస్ట్రేలియా నుంచి ఇటలీకి వెళ్లిన విమానంలో నల్లులు కనిపించడంతో విమానయాన సంస్థ క్వాంటాస్ తల పట్టుకోవాల్సి వచ్చింది. ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చాల్సిన విమానంలో ఈ రక్తపిపాసి అతిథులు ప్రత్యక్షం కావడంతో విమానాన్ని శుభ్రం చేసేందుకు సర్వీసు నుంచి తప్పించారు. ఫలితంగా రోమ్ నుంచి తిరిగి పెర్త్‌కు వెళ్లాల్సిన విమానం కూడా రద్దయింది. నల్లుల దెబ్బకు ప్రయాణికుల ప్రయాణ ప్రణాళికలు తలకిందులయ్యాయి.
అసలేం జరిగింది!
బ్రిటన్‌కు చెందిన ది గార్డియన్ కథనం ప్రకారం.. అక్టోబర్ 9న ఆస్ట్రేలియాలోని పెర్త్ నుంచి ఇటలీలోని రోమ్కు వెళ్లిన క్వాంటాస్ QF5 విమానంలో ఈ ఘటన జరిగింది. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలోని ముందు వైపు ఎకానమీ క్లాస్ క్యాబిన్లో బెడ్‌బగ్స్ (నల్లులు) కనిపించాయి.
విమానం రోమ్కు చేరుకున్న తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విమానం లోపలి భాగాలను పూర్తిగా శుభ్రం చేసేందుకు దాన్ని సర్వీసు నుంచి తొలగించారు. అక్టోబర్ 10న రోమ్ నుంచి పెర్త్‌కు తిరిగి వెళ్లాల్సిన విమానాన్ని కూడా రద్దు చేశారు.
విమాన టికెట్ కొంటే గంటల్లో ఖండాలు దాటవచ్చని ప్రయాణికులు అనుకుంటారు. కానీ, ఈ విమానంలో నల్లులు కనిపించడంతో ప్రయాణికులకు అదనపు నిరీక్షణ తప్పలేదు. విమానయాన సంస్థకు శుభ్రపరిచే పని, ప్రయాణికులకు కొత్త ఇబ్బందులు.. వెరసి నల్లులు తమ ఉనికిని గట్టిగానే చాటుకున్నాయి!
నల్లులు విమానంలోకి ఎలా వచ్చాయి?
విమానంలోకి నల్లులు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రయాణికుల లగేజీ లేదా దుస్తుల ద్వారా అవి విమానంలోకి చేరి ఉండవచ్చని ఆస్ట్రేలియాలోని మాక్వారీ యూనివర్సిటీకి చెందిన పరాన్నజీవుల నిపుణురాలు ప్రొఫెసర్ మిషెల్ పవర్ అభిప్రాయపడ్డారు.
నల్లులకు ప్రయాణాలతో సన్నిహిత సంబంధం ఉంటుందని ఆమె వివరించారు. నల్లులు ఉన్న హోటళ్లలో బస చేసినప్పుడు అవి సూట్‌కేసుల్లోకి చేరే అవకాశం ఉందని తెలిపారు. చీకటి ప్రదేశాల్లో దాక్కునే ఈ కీటకాలు.. ప్రయాణికుల దుస్తులు, లగేజీ ద్వారా మరో ప్రాంతానికి చేరవచ్చని పేర్కొన్నారు.
అంటే, మనం ఒక ఊరికి వెళ్లి మరో ఊరికి తిరిగి రావడమే కాదు.. మనకు తెలియకుండానే కొన్ని చిన్న జీవులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పించే ప్రమాదం ఉందన్నమాట!
50 రోజులకోసారి శుభ్రం చేసినా.. నల్లుల బెడద తప్పలేదా?
విమానాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని క్వాంటాస్ తెలిపింది. ముందస్తు జాగ్రత్తగా ప్రతి 50 రోజులకు ఒకసారి క్రిమిసంహారక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.
అయితే, విమానంలో నల్లులు కనిపించిన ఘటనతో ప్రయాణికుల లగేజీ, దుస్తుల ద్వారా కీటకాలు వ్యాపించే అవకాశంపై మరోసారి చర్చ మొదలైంది. విమానం ఎంత ఆధునికమైనదైనా, అందులో ప్రయాణించేవారి సామానుతో పాటు ఇలాంటి కీటకాలు చేరితే సమస్య తప్పదని ఈ ఘటన గుర్తుచేస్తోంది.
ఏదైమైనా
మనిషి ఖండాలు దాటేందుకు విమానాలు కనిపెట్టాడు. నల్లులు మాత్రం ఆ మనిషి కనిపెట్టిన ప్రయాణ సౌకర్యాలనే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఇంతకీ, తర్వాతి ప్రయాణంలో మనం పక్క సీటులో ఎవరు కూర్చున్నారో చూస్తామా.. లేక సీటు సందుల్లో ఎవరైనా దాక్కున్నారేమోనని కూడా ఒకసారి పరిశీలిస్తామా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల








