జాతీయ సరస్ మేళాలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..!
విజయవాడ వేదికగా దసరా శరన్నవరాత్రుల వేళ నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా 2026 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ఢిల్లీ వెలుపల విజయవాడలో ఈ మేళాను నిర్వహించడం రాష్ట్ర నారీ శక్తికి దక్కిన గౌరవమని కొనియాడారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవ భారత నారీ శక్తికి ప్రతిరూపమని సీఎం పేర్కొన్నారు.
గ్రామీణ మహిళల ఆదాయాన్ని పెంచడం, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం మరియు డ్వాక్రా ఉత్పత్తుల అంతర్జాతీయ మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా ‘స్వయం ఏపీ’ (SWAYAM AP) బ్రాండ్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ప్రారంభమైన డ్వాక్రా పొదుపు ఉద్యమం నేడు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం ఏపీలో 11 లక్షల స్వయం సహాయక సంఘాలు రూ.69 వేల కోట్ల టర్నోవరుతో దూసుకుపోతున్నాయని స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమైన ‘లక్ పతీ దీదీ’ల సాధనలో భాగంగా.. ఏపీలో ఇప్పటికే ఏడాది కాలంలో లక్ష మంది డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామని, భవిష్యత్తులో ఈ సంఖ్యను 10 లక్షలకు పెంచడమే తమ లక్ష్యమని వివరించారు. ఈ-కామర్స్ మరియు ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్లో ఇకపై మహిళా సంఘాల ఉత్పత్తులు ‘స్వయం ఏపీ’ బ్రాండ్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.








