అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పులకు కుట్ర.. రైఫిల్ పనిచేయకపోవడంతో తప్పిన ప్రమాదం!
19 ఏళ్ల యువకుడి ఇంట్లో ఆయుధాలు, వందల బుల్లెట్లు.. సహోద్యోగి సమాచారంతో వెలుగులోకి వచ్చిన కుట్ర
అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం అరోరాలో హిందూ ఆలయంపై సామూహిక కాల్పులకు ప్రయత్నించినట్లు 19 ఏళ్ల అలెగ్జాండ్రోస్ పాపోరాకిస్పై ఆరోపణలు నమోదయ్యాయి. ఆలయానికి వెళ్లి దాడి చేయాలని భావించినప్పటికీ, తుపాకీ పనిచేయకపోవడంతో అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు.
సహోద్యోగి ఇచ్చిన సమాచారంతో అరెస్ట్
అక్టోబర్ 11న ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందింది. నిందితుడు తన సహోద్యోగికి పంపిన సందేశాల్లో ఆలయంపై దాడికి ప్రయత్నించినట్లు చెప్పడంతో పాటు, టాక్టికల్ వెస్ట్ ధరించిన ఫొటోను, తన తీవ్రవాద భావజాలాన్ని వివరించే ఎనిమిది పేజీల పత్రాన్ని పంపినట్లు పోలీసులు వెల్లడించారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు పాలటైన్లోని తన నివాసం నుంచి బయటకు వస్తున్న సమయంలో పాపోరాకిస్ను అరెస్ట్ చేశారు.
ఇంట్లో ఆయుధాలు.. భారతీయులపై హింసకు సంబంధించిన ప్రస్తావనలు
నిందితుడి ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో రైఫిల్, లోడ్ చేసిన మ్యాగజైన్లు, వందల బుల్లెట్లు, టాక్టికల్ పరికరాలు, శరీర రక్షణ కవచంతో కూడిన వెస్ట్ను స్వాధీనం చేసుకున్నారు.
అతడికి సంబంధించినదిగా భావిస్తున్న “Why I Fought: A.K.A.: (Aurora Shooter’s Manifesto)” అనే పత్రంలో తెల్లజాతి ఆధిపత్యవాద భావజాలంతో పాటు, దక్షిణాసియా ప్రజలు, ముఖ్యంగా భారతీయులపై హింసకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అరోరా ప్రాంతంలోని హిందూ ప్రార్థనా స్థలాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి ప్రణాళిక రచించి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
భారత కాన్సులేట్ స్పందన
చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ ఘటనపై స్పందిస్తూ, అమెరికా అధికారులు సకాలంలో చర్యలు తీసుకోవడాన్ని స్వాగతించింది. స్థానిక భారతీయ సమాజ సభ్యులతో సంప్రదింపులు జరుపుతూ పరిణామాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
స్థానిక హిందూ ప్రార్థనా స్థలాలను పోలీసులు అప్రమత్తం చేశారు. దర్యాప్తులో FBI కూడా సహకరించింది.
పాపోరాకిస్పై ఉగ్రవాద బెదిరింపులకు సంబంధించిన ఒక అభియోగంతో పాటు, చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉన్నట్లు మరో అభియోగం మోపారు. కోర్టు అతడిని కస్టడీలో ఉంచాలని ఆదేశించింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








