అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు మరో షాక్!!
అమెరికాలో అడుగుపెట్టాలని కలలు కంటున్నవారికి అక్కడ ప్రభుత్వ నిర్ణయాల్లోని ప్రతి చిన్న మార్పు కీలకమే. ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు, చదువు పూర్తిచేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునే విద్యార్థులు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో వచ్చే పరిణామాలను నిశితంగా గమనిస్తుంటారు. అలాంటి వారిని ప్రభావితం చేసే ఓ కీలక పరిణామం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్ గడువులను పొడిగించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం అమెరికా ప్రభుత్వంలోని ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ (OMB) పరిశీలనలో ఉంది. అయితే ఈ మార్పులు అమల్లోకి వస్తే ఏమిటి పరిస్దితి? ఏయే దరఖాస్తులకు వర్తిస్తాయి?
వేల డాలర్లు కడుతున్నా.. త్వరగా పని పూర్తవుతుందనే గ్యారెంటీ లేదా?
సాధారణంగా అమెరికా ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుల ప్రాసెసింగ్కు ఎక్కువ సమయం పట్టే సందర్భాలు ఉంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు USCIS (యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్) కొన్ని రకాల దరఖాస్తులకు ప్రీమియం ప్రాసెసింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. దీనికోసం సాధారణ ఫీజుతో పాటు అదనంగా డబ్బులు చెల్లించాలి.
ప్రస్తుతం దరఖాస్తు రకాన్ని బట్టి ఈ అదనపు ఫీజు 1,780 డాలర్ల నుంచి 2,965 డాలర్ల వరకు ఉంది. అంటే భారతీయ కరెన్సీలో లక్షల రూపాయలకు సమానమైన మొత్తం. ఇంత డబ్బు చెల్లించడానికి కారణం ఒక్కటే.. దరఖాస్తుపై త్వరగా నిర్ణయం రావాలి. ఉద్యోగంలో చేరడం, వర్క్ పర్మిట్ పొందడం లేదా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో తదుపరి దశకు వెళ్లడం వంటి పనులు ఆలస్యం కాకూడదనేదే లక్ష్యం.
కానీ ఇప్పుడు ప్రీమియం ప్రాసెసింగ్ గడువులనే పొడిగించే ప్రతిపాదన పరిశీలనలో ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కొన్ని సందర్భాల్లో అదనపు ఫీజులు చెల్లించినప్పటికీ USCIS నిర్ణీత గడువులను దాటుతోందని ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ ఫ్రాగోమెన్ పేర్కొన్నట్లు నివేదిక వెల్లడించింది. అంటే ప్రీమియం ప్రాసెసింగ్కు డబ్బులు చెల్లించడం వల్ల దరఖాస్తు తప్పనిసరిగా ఆమోదం పొందుతుందనే హామీ ఉండదు. అలాగే, ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న గడువులు కూడా మారే అవకాశం ఉంది.
భారతీయ విద్యార్థులకు ఎందుకు టెన్షన్?
అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో చాలామంది చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేయాలని భావిస్తారు. ఇందుకోసం అర్హత ఉన్న విద్యార్థులు OPT (Optional Practical Training) కింద ఉద్యోగ అనుమతికి దరఖాస్తు చేసుకుంటారు. ముఖ్యంగా F-1 వీసాపై ఉన్న విద్యార్థులకు ఈ ప్రక్రియ ఎంతో కీలకం.
ప్రస్తుతం అర్హత కలిగిన కొన్ని OPT ఉద్యోగ అనుమతి దరఖాస్తులకు ప్రీమియం ప్రాసెసింగ్ గడువు 30 పని దినాలుగా ఉంది. ఈ గడువును పొడిగిస్తే, వేగంగా నిర్ణయం వస్తుందని ఆశించి అదనపు ఫీజు చెల్లించే విద్యార్థులు తమ ఉద్యోగ ప్రణాళికలను తిరిగి సర్దుబాటు చేసుకోవాల్సి రావచ్చు. అయితే, ప్రతిపాదనలో OPT దరఖాస్తులకు సంబంధించి ఎలాంటి మార్పులు ఉంటాయన్నది ఇంకా తెలియదు.
H-1B ఉద్యోగులు, గ్రీన్ కార్డు ఆశావహుల పరిస్థితి ఏమిటి?
అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులకు కూడా ఈ పరిణామం ముఖ్యమైనదే. ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రేషన్ పిటిషన్లు, కొన్ని వర్క్ వీసా పిటిషన్లు, గ్రీన్ కార్డు ప్రక్రియలోని దరఖాస్తులకు ప్రీమియం ప్రాసెసింగ్ అందుబాటులో ఉంటుంది.
ప్రస్తుతం అర్హత కలిగిన చాలా I-129 పిటిషన్లకు 15 పని దినాల ప్రాసెసింగ్ గడువు ఉండగా, కొన్ని I-140 పిటిషన్లకు 45 పని దినాల గడువు వర్తిస్తుంది. ఈ గడువుల్లో మార్పులు జరిగితే, ఉద్యోగులను అమెరికాకు తీసుకురావాలనుకునే కంపెనీలు, ఉద్యోగ మార్పులు లేదా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో కీలక నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నవారు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
ఎప్పటి నుంచి కొత్త నిబంధనలు?
OMB సమీక్ష పూర్తయిన తర్వాత ప్రతిపాదనను ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించి ప్రజల అభిప్రాయాలను స్వీకరించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ తర్వాతే తుది నిబంధనలు ఖరారవుతాయి. దీనికి కొన్ని నెలలు పట్టవచ్చు.
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది: ప్రస్తుతం ప్రీమియం ప్రాసెసింగ్ గడువులు మారలేదు. భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు USCIS అధికారిక ప్రకటనలను గమనించాలి. అదనపు ఫీజులు చెల్లిస్తే దరఖాస్తు ఆమోదం తప్పనిసరిగా వస్తుందనే హామీ కూడా ఉండదు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








