గుంటూరులో జనసేన మార్క్ స్కెచ్..!
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల(Municipal elections) వేడి మొదలైన వేళ, గుంటూరు జిల్లాలో కూటమి రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది. గుంటూరులో జరిగిన జనసేన(Janasena) పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తల కీలక సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై నేతలు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జనసేన గుంటూరు జిల్లా పార్లమెంట్ సమన్వయకర్త కిలారి రోశయ్య పార్టీ కార్యాచరణను అధికారికంగా ప్రకటించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో జనసేన తరఫున ఖచ్చితంగా 35 శాతం సీట్లను కూటమి చర్చల్లో అడుగుతున్నామని ఆయన స్పష్టం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
జిల్లాలో జనసేన పార్టీకి గట్టి పట్టున్న స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేసి తీరాలని ఈ సమావేశంలో నేతలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. గుంటూరు కార్పొరేషన్తో పాటు జిల్లాలోని కీలకమైన పొన్నూరు, తెనాలి మున్సిపాలిటీలలో కూడా జనసేన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నట్లు కిలారి రోశయ్య వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని బట్టి సీట్ల కేటాయింపు ఉండాలని, గత ఎన్నికల కంటే ఈసారి క్యాడర్ మరింత ఉత్సాహంతో ఉందని నేతలు అభిప్రాయపడ్డారు.
స్థానిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి కూటమిలో సీట్ల సర్దుబాటుపై తీవ్ర చర్చలు సాగుతున్న తరుణంలో, జనసేన నేరుగా 35 శాతం సీట్ల ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం విశేషం. పొరుగున ఉన్న తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లో కూడా మున్సిపల్ వార్డుల కేటాయింపుపై తెలుగుదేశం, జనసేన స్థానిక నేతల మధ్య సమన్వయ చర్చలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లాలో కూటమి బంధం పటిష్టంగానే ఉన్నప్పటికీ, ఈ సీట్ల డిమాండ్ల పర్వం రాబోయే రోజుల్లో ఎలాంటి ముగింపునకు వస్తుందనేది స్థానిక రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.








