కొత్త డేటింగ్ ట్రెండ్! ఆడవాళ్లను ఆకర్షించాలంటే ..ఇదా మార్గం?
డేటింగ్లో అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. లుక్స్ మార్చుకోవడం, జిమ్‌లో గంటల తరబడి గడపడం, ఖరీదైన పెర్ఫ్యూమ్లు కొనడం.. ఇలా చాలా హంగామానే చేస్తుంటారు. అయితే ఇవన్నీ ఆ వయస్సులో సహజమే కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు డేటింగ్ కు సంభందించి సోషల్ మీడియాలో ఓ కొత్త ట్రెండ్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
అమ్మాయిలను ఆకర్షించాలంటే అబ్బాయిలు ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరమే లేదని కొందరు చెబుతున్నారు. పైగా, ఇప్పటివరకు మీరు ఫాలో అవుతున్న అలవాట్లే మీ డేటింగ్ లైఫ్‌కు అడ్డంకిగా మారుతున్నాయంటున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటి? అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఇప్పుడు కొందరు అబ్బాయిలు ఫాలో అవుతున్న ఆ వింత ట్రెండ్ ఏమిటి?
అమ్మాయిలను ఆకర్షించడానికి కొత్త ఫార్ములా!
ఈ ట్రెండ్ పేరు ‘Pheromone-Maxxing’. సోషల్ మీడియాలో ముఖ్యంగా టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చర్చకు వస్తున్న ఈ ట్రెండ్ ప్రకారం.. అబ్బాయిలు తమ శరీరం నుంచి సహజంగా వెలువడే వాసనను అలాగే ఉంచుకోవాలట. సబ్బుతో స్నానం చేయడం, డియోడరెంట్ వాడటం, పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవడం వంటి అలవాట్లను తగ్గిస్తే సహజమైన ఆకర్షణ పెరుగుతుందని కొందరు నమ్ముతున్నారు.
అంటే, ఇప్పటివరకు డేట్‌కు వెళ్లే ముందు ఫ్రెష్‌గా రెడీ అవ్వడానికి ప్రయత్నించిన అబ్బాయిలకు ఈ ట్రెండ్ పూర్తిగా భిన్నమైన సలహా ఇస్తోందన్నమాట!
ఈ ఆలోచనను నమ్మేవాళ్లు తమ సహజ శరీర వాసనను కప్పిపుచ్చుకోవడం వల్ల ఆకర్షణకు కారణమయ్యే రసాయనాల ప్రభావం తగ్గిపోతుందని వాదిస్తున్నారు. అందుకే కొందరు చెమట వాసనను కూడా అలాగే ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
అయితే, ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ నిజంగానే స్నానం మానేస్తున్నారని చెప్పలేం. సోషల్ మీడియాలో కనిపించే ఇలాంటి సలహాలను కొందరు సీరియస్‌గా తీసుకుంటే, మరికొందరు మీమ్స్‌గా, సరదా ప్రయోగాలుగా చూస్తున్నారు.
అసలు ఈ ఫెరోమోన్లు అంటే ఏమిటి?
ఈ ట్రెండ్‌లో కీలకమైన పదం ‘ఫెరోమోన్లు’. కొన్ని జంతువుల్లో ఇవి రసాయన సంకేతాలుగా పనిచేస్తాయి. ఒక జీవి విడుదల చేసే ఈ సంకేతాలు అదే జాతికి చెందిన ఇతర జీవుల ప్రవర్తన లేదా శారీరక ప్రతిస్పందనలను ప్రభావితం చేయగలవు.
ఈ విషయం నుంచే మనుషుల్లో కూడా ఇలాంటి రసాయనాలు ఆకర్షణను ప్రభావితం చేస్తాయా అనే ప్రశ్న మొదలైంది.
ఇవి కూడా చదవండి
మన శరీరం నుంచి వివిధ రకాల రసాయనాలు వెలువడతాయి. మనుషుల శరీర వాసనను గుర్తించే సామర్థ్యం కూడా వ్యక్తుల మధ్య మారుతుంది. కొన్ని పరిశోధనలు శరీర వాసన, వ్యక్తిగత ఇష్టాలు, సామాజిక సంబంధాల మధ్య ఉండే అవకాశమున్న సంబంధాలను పరిశీలించాయి.
కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మనుషుల్లో మహిళలను లైంగికంగా ఆకర్షించే నిర్దిష్ట ఫెరోమోన్‌ను శాస్త్రవేత్తలు ఇప్పటివరకు నిస్సందేహంగా గుర్తించలేదు. అలాగే, స్నానం చేయకుండా ఉండటం వల్ల ఆకర్షణ పెరుగుతుందని నిరూపించే బలమైన ఆధారాలు కూడా లేవు.
అంటే, ఫెరోమోన్ల గురించి శాస్త్రీయ ఆసక్తి ఉండటం వేరు.. వాటి పేరుతో సోషల్ మీడియాలో ప్రచారమయ్యే ప్రతి చిట్కా నిజమని నమ్మడం వేరు.
మరి సహజ శరీర వాసనకు అసలు ప్రాధాన్యం లేదా?
ఉందని చెప్పవచ్చు. మనుషుల శరీర వాసన ఇతరులపై కలిగే అభిప్రాయాన్ని ప్రభావితం చేయవచ్చు. అయితే, ఆ ప్రభావం అందరిలో ఒకేలా ఉండదు.
ఒకరికి నచ్చిన సువాసన మరొకరికి నచ్చకపోవచ్చు. కొందరికి మృదువైన పెర్ఫ్యూమ్ ఇష్టం ఉండొచ్చు. మరికొందరికి బలమైన సువాసనలు అసౌకర్యం కలిగించవచ్చు. వ్యక్తిగత అభిరుచులు, పరిచయం, సందర్భం వంటి అంశాలు కూడా ఇందులో పాత్ర పోషిస్తాయి.
అయితే, సహజ శరీర వాసనకు కొంత ప్రాధాన్యం ఉండవచ్చనే విషయాన్ని తీసుకుని, చెమట వాసనను అలాగే ఉంచుకుంటే మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతారని నిర్ణయించలేం.
ఉదాహరణకు, రద్దీగా ఉండే బస్సు లేదా మెట్రోలో చెమట వాసన వల్ల ఇబ్బంది పడటం ఒక అనుభవం. మనకు నచ్చిన వ్యక్తి నుంచి వచ్చే సహజమైన వాసనను ఇష్టపడటం మరో అనుభవం. ఈ రెండింటినీ ఒకేలా చూడలేం.
అందుకే ఈ ట్రెండ్‌లో ప్రచారమవుతున్న వాదనలకు, నిజ జీవితంలో ఆకర్షణ ఎలా పనిచేస్తుందనే విషయానికి మధ్య తేడా ఉంది.
అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఇవి సరిపోతాయా?
డేటింగ్లో ఆకర్షణ అనేది కేవలం రూపం లేదా వాసనతో నిర్ణయించబడదు. ఒక వ్యక్తి మాట్లాడే తీరు, హాస్యచతురత, ఆత్మవిశ్వాసం, ఎదుటివారిని గౌరవించే విధానం, భావోద్వేగ అనుబంధం వంటి అనేక అంశాలు సంబంధాలపై ప్రభావం చూపుతాయి.
అయినా సోషల్ మీడియాలో ప్రతి సమస్యకూ ఒక కొత్త హ్యాక్ కనిపిస్తోంది. లుక్స్ మెరుగుపరుచుకోవడానికి ‘Looksmaxxing’, శరీరాకృతిపై దృష్టి పెట్టడానికి రకరకాల ఫిట్నెస్ ట్రెండ్లు.. ఇప్పుడు ఆకర్షణ పెంచుకోవడానికి ‘Pheromone-Maxxing’!
ఈ ట్రెండ్లలో కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించవచ్చు. కానీ మరికొన్ని మాత్రం ఆకర్షణను ఒక సులభమైన ఫార్ములాగా చూపించే ప్రయత్నం చేస్తాయి.
ఒక వ్యక్తి తన రూపాన్ని మెరుగుపరుచుకోవడం తప్పు కాదు. తనకు నచ్చిన సువాసనను ఎంచుకోవడం కూడా తప్పు కాదు. కానీ ఇవన్నీ చేసినా ఎదుటివారు మనల్ని ఇష్టపడాలనే గ్యారంటీ ఉండదు. అలాగే, స్నానం మానేస్తే ఆకర్షణ పెరుగుతుందనే హామీ కూడా లేదు.
ఇంటర్నెట్లో ఈ ట్రెండ్‌పై ట్రోలింగ్ ఎందుకు?
ఫెరోమోన్-మ్యాక్సింగ్పై ఆన్లైన్లో కొందరు పురుషులు కూడా వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. రెడిట్‌లో జరిగిన చర్చల్లో కొంతమంది ఈ ట్రెండ్‌ను మరో ఇంటర్నెట్ ఫ్యాడ్గా అభివర్ణించారు. మరికొందరు ‘మ్యాక్సింగ్’ పేరుతో ప్రతి విషయాన్నీ ఒక కొత్త హ్యాక్‌గా మార్చేయడాన్ని ప్రశ్నించారు.
పెర్ఫ్యూమ్ వాడటం మానేసిన తర్వాత తమ నుంచి వచ్చే ఉల్లిపాయల వంటి ఘాటు వాసనకు ఎక్కువ కాంప్లిమెంట్లు వస్తున్నాయని ఒక యూజర్ సరదాగా వ్యాఖ్యానించాడు. మరికొందరు దీనికి పరిష్కారం స్నానం మానేయడం కాదని, ‘Bathmaxxing’ అంటూ పరిశుభ్రంగా ఉండటమేనని చమత్కరించారు.
ఇలాంటి వ్యాఖ్యలు శాస్త్రీయ ఆధారాలు కావు. కానీ ఈ ట్రెండ్‌ను అందరూ సీరియస్‌గా తీసుకోవడం లేదనే విషయాన్ని మాత్రం సూచిస్తున్నాయి.
ఈ ట్రెండ్‌పై విమర్శల్లో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. డేటింగ్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం వెతకడం సహజమే. అయితే, మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడం కంటే చిన్నచిన్న హ్యాక్లపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల అసలు సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అనే ప్రశ్న ఎదురవుతోంది.
స్నానం మానేస్తే డేటింగ్లో సక్సెస్ వస్తుందా?
ప్రస్తుతానికి అలాంటి వాదనకు శాస్త్రీయ మద్దతు లేదు. వ్యక్తిగత పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆకర్షణ పెరుగుతుందని చెప్పలేం. పైగా, చెమట, శరీర నూనెలు, చర్మంపై పేరుకుపోయే మలినాలను బట్టి శరీర వాసన మారుతుంది. కొందరిలో అధిక చెమట లేదా తగినంత పరిశుభ్రత లేకపోవడం వల్ల అసహ్యకరమైన వాసన రావచ్చు.
అందుకే ఆకర్షణ పెరుగుతుందనే ఆశతో స్నానం మానేయడం లేదా డియోడరెంట్ను పూర్తిగా వదిలేయడం అవసరం లేదు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, మనకు నచ్చిన సువాసనను పరిమితంగా ఉపయోగించుకోవచ్చు.
ముఖ్యంగా, ఎదుటివారికి ఏది నచ్చుతుందో తెలుసుకోవడానికి సోషల్ మీడియా ట్రెండ్ల కంటే నిజమైన సంభాషణ, పరస్పర గౌరవం, వ్యక్తిగత అభిరుచులను అర్థం చేసుకోవడం ఉపయోగపడతాయి.
చివరగా చెప్పాలంటే.. డేటింగ్లో అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు ఎన్ని కొత్త ట్రెండ్లు ఫాలో అయినా, ఎట్రాక్షన్ కు షార్ట్‌కట్ మాత్రం లేదు. ‘Pheromone-Maxxing’ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయినా, స్నానం మానేయడమే ప్రేమకు రహస్యమని నమ్మడానికి మాత్రం ఇప్పటివరకు ఆధారాలు లేవు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








