“రణబాలి” సినిమాలోని జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించిన హీరోయిన్ రశ్మిక
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ
సేవా కార్యక్రమాలతో తన గొప్ప మనసు చాటుకుంటున్నారు హీరోయిన్ రశ్మిక మందన్న. తన కొత్త సినిమా రణబాలిలో జయమ్మ పాత్ర స్ఫూర్తిగా రశ్మిక అన్నపూర్ణ అనే సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా 8 వివిధ ప్రాంతాలకు చెందిన 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించారు. ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తానని ఆమె వెల్లడించారు. రశ్మిక చేపట్టిన అన్నపూర్ణ ప్రాజెక్ట్ పట్ల విజయ్ దేవరకొండ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రశ్మికను చూస్తుంటే గర్వంగా ఉందంటూ స్పందించారు. మరోవైపు నెటిజన్స్ పెద్ద సంఖ్యలో రశ్మిక సేవా కార్యక్రమాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు.
ఈ సందర్భంగాహీరోయిన్ రశ్మిక స్పందిస్తూ – జయమ్మ పాత్రకు మీకు ఏవైనా పోలికలు ఉన్నాయా అని మీరు నన్ను అడుగుతుంటారు. నేను అవుననే సమాధానం ఇస్తాను. మీరు నాపై చూపించే ప్రేమకు కృతజ్ఞతగా ఇలాంటి మంచి పనులు చేస్తుంటాను కానీ ఎవరికీ చెప్పలేదు. నాకు, నా టీమ్ కు తెలిస్తే చాలు అనుకున్నాను. కానీ మిమ్మల్ని కూడా నా సేవా కార్యక్రమం ఇన్స్ పైర్ చేస్తుందనే కారణంతో ఇప్పుడు చెబుతున్నాను. నేను ఈరోజు 400 కుటుంబాలను దత్తత తీసుకున్నాను. ఒకేసారి 400 కుటుంబాలకు ప్రతి 3 నెలల చొప్పున సహాయం చేస్తూ, ఏడాది పొడవునా దీనిని కొనసాగించాలనుకుంటున్నాను. ఆ నిత్యావసర సరుకుల డబ్బును పొదుపు చేసుకుని, రాబోయో రోజులకు దాచుకుంటారని ఆశిస్తున్నాను. అని అన్నారు.
విజయ్ దేవరకొండ స్పందిస్తూ – ఇలాంటి మంచి కార్యక్రమాలు నువ్వు ఎప్పటి నుంచో చేస్తున్నావు కానీ ఎవరికీ తెలియనివ్వలేదు. ఇప్పుడు నువ్వు చేపట్టిన అన్నపూర్ణ ప్రాజెక్ట్ ఏడాది పాటు 400 కుటుంబాలకు అండగా నిలబడుతుంది. వాతావారణ మార్పులతో కరువు పరిస్థితులు ఏర్పడుతున్న ఈ క్లిష్ట సమయంలో ఆ కుటుంబాలను కాపాడుతుంది. నీ మంచి మనసుకు గర్వపడుతున్నాం. మనం ఎదగడమే కాదు మన వాళ్ల కోసం నిలబడదాం. అన్నారు.
విజయ్, దేవరకొండ రశ్మిక జంటగా నటించిన రణబాలి సినిమా ఈ నెల 16న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.








