బెజవాడ, గుంటూరు పంచాయితీలు సీఎం వద్దకు..!
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి కూటమి పార్టీలైన తెలుగుదేశం(TDP), జనసేన సమాయత్తం అవుతున్న వేళ సీట్ల సర్దుబాటు వ్యవహారం అత్యంత ఉత్కంఠ భరితమైన ముగింపు దశకు చేరుకుంది. గుంటూరు, విజయవాడ(Vijayawada mayor) నగరాల మేయర్ పీఠాలతో పాటు స్థానిక వార్డుల కేటాయింపులపై క్షేత్రస్థాయి కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి, కంగారు నెలకొన్న తరుణంలో ఈ వివాదానికి ముగింపు పలికేందుకు జనసేన అగ్రనేతలు రంగంలోకి దిగారు.
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడితో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కీలక నేత లింగమనేని రమేష్ అత్యవసరంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటును జనసేనకు కేటాయించే యోచనపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం, వంగవీటి రాధాకృష్ణ ఎంట్రీతో సమీకరణాలు మారడం తెలిసిందే. అటు గుంటూరులో కూడా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ పట్టును కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా, జనసేన జిల్లా నేత కిలారి రోశయ్య ఏకంగా 35 శాతం సీట్లను డిమాండ్ చేస్తూ గట్టి పట్టుబట్టారు.
ఈ నేపథ్యంలో స్థానిక నేతల మధ్య సద్దుమణగని ఈ సీట్ల పంచాయితీని నేరుగా అధినేతల స్థాయిలోనే తేల్చుకునేందుకు నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్లు సీఎం చంద్రబాబు ముందుకు ఈ జిల్లాల పక్కా రిపోర్టులను ఉంచినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో విజయవాడ, గుంటూరు, విజయనగరం వంటి ప్రతిష్టాత్మక కార్పొరేషన్ల మేయర్ స్థానాలపై ఒక పక్కా క్లారిటీకి వచ్చే అవకాశం ఉందని, అలాగే అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలకు భవిష్యత్తులో నామినేటెడ్ పదవుల ద్వారా ఎలా సర్దుబాటు చేయాలో కూడా చంద్రబాబు, నాదెండ్ల చర్చించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ అత్యవసర భేటీతోనైనా రాజధాని జిల్లాల కూటమి సీట్ల పంచాయితీకి పూర్తి స్థాయిలో తెరపడుతుందో లేదో వేచి చూడాలి.








