‘రణబాలి’ ప్రీ రిలీజ్ బిజినెస్ : ఎంతకు అమ్మారు,ఎంతొస్తే బ్రేక్ ఈవెన్?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు (అక్టోబర్ 16) ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విజయ్ చాలా నమ్మకంగా ఉన్నారు. అభిమానులు సైతం ఆశగా ఓ పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా ఏ మాత్రం బాగున్నా దశరా శెలవులు కలిసి వస్తాయి. అయితే ఇవన్నీ మామాలు లెక్కలు. కానీ సినిమా హిట్ అనిపించుకోవాలంటే ఎంత వసూలు చేయాలనేది బిజినెస్ ని బట్టి అంచనా వేస్తుంది ట్రేడ్. ఆ లెక్కలేంటో చూద్దాం.
రణబాలి హిట్ కావాలంటే ఎంత గ్రాస్ రావాలి?!
‘రణబాలి’ ప్రపంచవ్యాప్తంగా హిట్ అనిపించుకోవాలంటే సుమారు రూ.40 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ అంచనా. ఈ బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లు అవసరమని అంచనా వేస్తున్నారు.
నాన్-థియేట్రికల్ ఎంతుకు అమ్మారు
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి… సినిమా విడుదలకు ముందే నిర్మాతలు నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా భారీ మొత్తాన్ని రాబట్టారు. ఈ హక్కుల అమ్మకం ద్వారా మొత్తం రూ.82 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం.
ముఖ్యంగా ఈ సినిమాని అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కలిపి నెట్‌ఫ్లిక్స్ రూ.52 కోట్లకు దక్కించుకుంది. మిగతా నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా మరో రూ.30 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు మంచి ఆదాయం సమకూరింది. అంటే మొత్తం 82 కోట్లు బిజినెస్ అయ్యినట్లు.
అయితే, ఈ రూ.82 కోట్ల ఆదాయాన్ని సినిమా పూర్తి లాభంగా పరిగణించలేం. నిర్మాణ వ్యయం, ప్రచార ఖర్చులు, థియేట్రికల్ హక్కుల విక్రయాలు, ఇతర ఆర్థిక లెక్కలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
రణబాలి డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ ఎంతంటే?
విడుదల రోజుకు సంబంధించి సినిమా సాధించిన అడ్వాన్స్ బుకింగ్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
– తెలంగాణ: రూ.2.32 కోట్లు
– ఆంధ్రప్రదేశ్: రూ.1.60 కోట్లు
– భారత్ మొత్తం: రూ.4.50 కోట్లు
– ఓవర్సీస్: రూ.4.00 కోట్లు
– ప్రపంచవ్యాప్తంగా: రూ.8.50 కోట్లు
ఈ గణాంకాల ప్రకారం, తెలుగు రాష్ట్రాల నుంచే భారతదేశ అడ్వాన్స్ బుకింగ్స్‌లో అత్యధిక భాగం నమోదైంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా సినిమా సాధించాల్సిన వసూళ్లతో పోలిస్తే ప్రస్తుత ప్రీ-సేల్స్ ఇంకా పరిమితంగానే ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ బుకింగ్స్
భారతదేశంలో నమోదైన రూ.4.50 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్‌లో తెలుగు రాష్ట్రాల వాటా రూ.3.92 కోట్లు. అంటే, దేశీయ ప్రీ-సేల్స్‌లో దాదాపు 87 శాతం తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి.
తెలంగాణలో రూ.2.32 కోట్లతో బుకింగ్స్ ముందంజలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి రూ.1.60 కోట్లు నమోదయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో టికెట్ బుకింగ్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
‘రణబాలి’ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతున్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల వెలుపల దేశీయ మార్కెట్లలో అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా పుంజుకోలేదు. దీంతో తొలి రోజు వసూళ్లలో తెలుగు మార్కెట్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఓవర్సీస్లో పోటీ ఇస్తున్న రణబాలి
దేశీయ మార్కెట్‌తో పోలిస్తే ఓవర్సీస్ బుకింగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. విదేశాల్లో ఈ సినిమా రూ.4 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ సాధించింది. ఇది భారత్ మొత్తం ప్రీ-సేల్స్‌కు దాదాపు సమానంగా ఉండటం గమనార్హం.
ముఖ్యంగా అమెరికాలో విజయ్ దేవరకొండకు ఉన్న మార్కెట్ ఈ సినిమాకు ఉపయోగపడుతోంది. విడుదలకు ముందు రోజుల్లో అమెరికా ప్రీమియర్ బుకింగ్స్ వేగంగా పెరిగినట్లు ట్రేడ్ వర్గాల గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ వృద్ధి కారణంగా అక్కడి తెలుగు వెర్షన్ బుకింగ్స్ ‘జైలర్ 2’ తెలుగు వెర్షన్‌ను కూడా అధిగమించినట్లు కథనంలో పేర్కొన్నారు.
అయితే, అడ్వాన్స్ బుకింగ్స్‌లో కనిపిస్తున్న ఈ ఊపు తొలి రోజు వసూళ్లుగా ఎంతవరకు మారుతుందనేది చూడాలి.
దసరా సెలవులు.. పాజిటివ్ టాక్ కలిసొస్తాయా?
‘రణబాలి’కి ప్రధానంగా రెండు అంశాలు కలిసొచ్చే అవకాశముంది.
మొదటిది దసరా పండుగ సెలవులు. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండే ఈ సమయంలో సినిమా విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచకపోవడం, U/A సర్టిఫికెట్ రావడం కూడా కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఉపయోగపడవచ్చు.
రెండోది ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన. సినిమా కథ, భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటే తొలి రోజు తర్వాత కూడా వసూళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. ‘రణబాలి’కి కూడా మొదటి షోల నుంచే మంచి రెస్పాన్స్, టాక్ వస్తే, దసరా సెలవులను ఉపయోగించుకుని బ్రేక్ ఈవెన్ దిశగా పయనించే అవకాశం ఉంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








