బీఆర్ఎస్ ఆస్తులెన్నో తెలిస్తే షాక్!?
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆర్థిక పరిస్థితి, పార్టీ ఆస్తులకు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడిట్ నివేదికలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన లెక్కల ప్రకారం.. బీఆర్ఎస్ వద్ద రూ. 1,509 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తేలింది. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి ఇంత పెద్దఎత్తున ఆస్తులు కలిగి ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీఆర్ఎస్ సమకూర్చుకున్న భారీ నిధులు, వాటి నిర్వహణ తీరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ఈసీ నివేదికల ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీ ఆస్తుల్లో సింహభాగం నగదు రూపంలోనే ఉంది. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు, సేవింగ్స్ రూపంలో ఏకంగా రూ. 1,431 కోట్లకు పైగా నగదు నిల్వలు ఉన్నట్లు స్పష్టమైంది. ముఖ్యంగా దీర్ఘకాలిక మెచ్యూరిటీ పీరియడ్ తో కూడిన షెడ్యూల్డ్ బ్యాంక్ డిపాజిట్ల రూపంలోనే దాదాపు రూ. 1,237 కోట్లు ఉన్నట్లు పార్టీ ఆడిట్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. దీనికి తోడు భవనాలు, ఇతర స్థిర, చరాస్తుల రూపంలో మరో రూ. 66 కోట్లకు పైగా విలువైన ఆస్తులు పార్టీ పేరిట నమోదై ఉన్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో పార్టీకి వివిధ మార్గాల ద్వారా సుమారు రూ. 114 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. అదే సమయంలో పార్టీ నిర్వహణ, రాజకీయ కార్యకలాపాల కోసం జరిగిన ఖర్చు కూడా భారీగానే ఉంది. ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలు, ప్రకటనలు, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు, ఉద్యోగుల వేతనాలు తదితర వ్యయాలన్నింటినీ కలుపుకుంటే ఏడాదిలో పార్టీ సుమారు రూ. 162 కోట్లు ఖర్చు చేసింది. వచ్చిన ఆదాయం కంటే వ్యయం సుమారు రూ. 48 కోట్లు ఎక్కువగా ఉండటంతో.. పార్టీ జనరల్ ఫండ్ కాస్త తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం ప్రచారం, బహిరంగ సభల కోసమే వందల కోట్లు వెచ్చించినట్లు లెక్కలు చెబుతున్నాయి.
తెలంగాణలో అధికారం కోల్పోయి, ప్రతిపక్ష స్థానంలోకి వెళ్లిన తర్వాత కూడా గులాబీ పార్టీ ఆర్థికంగా అత్యంత పటిష్టంగా ఉందనే సంకేతాలను ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అధికారం కోల్పోయినప్పటికీ, పార్టీ యంత్రాంగాన్ని నడిపించడానికి, భవిష్యత్ రాజకీయ పోరాటాలను ఎదుర్కోవడానికి అవసరమైన బలమైన ఆర్థిక వనరులు బీఆర్ఎస్ వద్ద ఇంకా ఉన్నాయని చెప్పవచ్చు. మరోవైపు, ప్రాంతీయ పార్టీలు కూడా కార్పొరేట్ స్థాయి ఆర్థిక లావాదేవీలను కలిగి ఉండటం, అత్యధికంగా ఫిక్స్డ్ డిపాజిట్లు, నగదు నిల్వలను నిర్వహించడం భారత రాజకీయాల్లో సరికొత్త ధోరణికి అద్దం పడుతోంది.








