సింగరేణి రగడ.. ఎవరి మాట కరెక్ట్?
సింగరేణి చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. సింగరేణిని దెబ్బతీస్తున్నారంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. సింగరేణిలో నెలకొన్న నష్టాలకు, ప్రస్తుత దుస్థితికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే కారణమని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుండగా… ప్రభుత్వ వైఫల్యాలే సింగరేణి దుస్థితికి కారణమని కేటీఆర్ విమర్శిస్తున్నారు. సుమారు 3,000 కోట్ల రూపాయల బొగ్గు దిగుమతి కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అయితే సింగరేణి అంశంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని సీఎం రేవంత్ సవాల్ విసిరారు.
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోవడం, విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుంటూ ఉండడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కోసం గ్రేడ్-9 బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలనే ప్రతిపాదనపై సీబీఐ, ఈడీ లేదా ఐటీ విభాగాలతో స్వతంత్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విదేశీ బొగ్గు దిగుమతుల వల్ల సుమారు 3,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగే అవకాశం ఉందని చెప్పారు. లాజిస్టిక్స్, ప్రొక్యూర్మెంట్ డెసిషన్స్లో భారీగా కమిషన్లు చేతులు మారుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. అంతేకాకుండా, గతంలో సింగరేణి ద్వారా సరఫరా కావాల్సిన బొగ్గును క్రమంగా తగ్గించి, విదేశీ దిగుమతుల వైపు మొగ్గు చూపేలా ప్లాన్ చేసారని ఆయన మండిపడ్డారు. సింగరేణి ఉత్పత్తి 2023-24లో సుమారు 70.02 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి 58 మిలియన్ టన్నులకు పడిపోయిందని, సంస్థ రావాల్సిన బకాయిలు, చెల్లింపులపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా స్పందించారు. విదేశీ బొగ్గు దిగుమతి వ్యవహారంపై ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ జరిపించడానికి ప్రభుత్వం సిద్ధమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే యాదాద్రి ప్లాంట్ కోసం విదేశాల నుంచి గ్రేడ్-9 బొగ్గును దిగుమతి చేసుకునేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆయన ఆధారాలతో సహా వివరించారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల సింగరేణి సంస్థను క్రమంగా పక్కనబెట్టి, కొందరికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. యాదాద్రి ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఇతర కేంద్రాలతో పోలిస్తే భారీగా పెరిగిందని, దీనివల్ల ప్రజలపై అదనపు భారం పడుతోందని ప్రభుత్వం పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలు, అప్పట్లో ఎన్జీటీలో దాఖలైన పిటిషన్లు అన్నీ సింగరేణికి నష్టం కలిగించేలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
సింగరేణి సంస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. ఇటువంటి కంపెనీపై అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఈ రాజకీయ పోరు సంస్థ ఉనికిని, కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. బొగ్గు దిగుమతులు, ఉత్పత్తి పడిపోవడం, అంచనా వ్యయాల పెంపు వంటి అంశాలపై రెండు పార్టీలు పరస్పరం అవినీతి ఆరోపణలు గుప్పించుకోవడం రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారితీసింది. ఈ వివాదానికి తెరపడాలంటే సమగ్రమైన నిష్పాక్షిక విచారణ జరిగి, వాస్తవాలు ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.








