ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరవు : కేటీఆర్
రాష్ట్రంలో నెలకొన్న నీటి ఎద్దడికి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది కాలం తెచ్చిన కరవు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరవు అని ఆరోపించారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 750 టీఎంసీలకు పైగా గోదావరి నీటిని, 250 టీఎంసీల కృష్ణా జలాలను దిగువకు విడుదల చేశారు. గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కన్నెపల్లి 9 Kannepalli), దేవాదుల (Devadula) పంపులను సక్రమంగా వినియోగించి గోదావరిపైన ఉన్న రిజర్వాయర్లు, చెరువులను నింపే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. మరోవైపు పాలమూరు- రంగారెడ్డి , కల్వకుర్తి (Kalwakurthy) ఎత్తిపోతల పథకాల పంపులను ఆన్ చేయకుండా కృష్ణా జలాలలను వృథా చేశారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తగ్గే అవకాశం ఉందని మార్చి నుంచే వాతావరణ నిపుణులు హెచ్చరించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదు అని విమర్శించారు.








