దేశంలోనే అతి పెద్ద భూ కుంభకోణం.. సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్
తెలంగాణ రాజకీయాల్లో భూ వివాదాలు ఎప్పుడూ అత్యంత సున్నితమైన అంశంగానే ఉంటాయి. తాజాగా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న సుమారు 23 లక్షల ఎకరాల భూ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన భూఅక్రమాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత అల్లేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇరు పార్టీలు ఒకరినొకరు రక్షించుకునే ధోరణిలో ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొద్ది రోజుల కిందట రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో లక్షల ఎకరాల భూములు చేతులు మారినట్లు చెప్పారు. దీని అస్త్రంగా చేసుకున్న బీజేపీ, ఆ భూములపై విచారణగు డిమాండ్ చేస్తోంది. దాదాపు 13వేల మంది వ్యక్తులు అక్రమంగా భూములు పొందినప్పటికీ, ప్రభుత్వం ఇప్పటివరకు వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద మతలబు ఉందని మహేశ్వర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేస్తూ, లబ్ధిదారుల రిజిస్ట్రేషన్లను ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీశారు.
ఈ భూ కుంభకోణానికి సంబంధించి బీజేపీ పలు ఆధారాలను కూడా బయటపెట్టింది. వివాదాస్పద ఐడీపీఎల్ భూములు ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్టర్ కావడం వెనుక ఎవరి హస్తం ఉందని ప్రశ్నించింది. అలాగే శేరిలింపల్లి పరిధిలో సుమారు రూ. 7,000 కోట్ల విలువైన 27.18 ఎకరాల భూమి వంశీరామ్ బిల్డర్స్ చేతికి ఎలా వెళ్లిందని నిలదీసింది. పుప్పాలగూడలో రూ. 1,500 కోట్ల విలువైన ఏడు ఎకరాల భూమిని రెవెన్యూ మంత్రి కుటుంబానికి చెందిన ‘నోవా’ సంస్థకు కేటాయించడం వెనుక ఎవరున్నారని అడిగింది. అలాగే నానక్రామ్గూడలో ఎస్ఈజెడ్ భూములను ఫీనిక్స్ టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ స్వాధీనం చేసుకోవడం వెనుక ఎవరి హస్తం ఉందో బయటపటెట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. అంతేకాకుండా.. ఎండోమెంట్, వక్ఫ్ భూములు 5.12 లక్షల ఎకరాలు, భూదాన్ భూములు 1.79 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం కావడంపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. అటవీ రక్షిత జాబితా నుంచి 25,518 ఎకరాలను తొలగించడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ప్రశ్నించింది.
ఇవి కూడా చదవండి
భూఅక్రమాలపై ప్రభుత్వం అసెంబ్లీలో నామమాత్రపు చర్చ జరిపిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను పక్కనపెట్టి సిట్ ఏర్పాటు చేయడం కేవలం కాలయాపన చేయడమేనని విమర్శించింది. ఇది దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని, ప్రభుత్వం వెంటనే రిజిస్ట్రేషన్లను రద్దు చేసి భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని బీజేపీ హెచ్చరించింది. దీంతో ఈ భూ వివాదం రానున్న కాలంలో అధికార, విపక్షాల మధ్య మరింత అగ్గిరాజేసేలా కనిపిస్తోంది.








