ఢిల్లీలో ఆందోళనలతో నష్టపోతున్నాం.. సుప్రీంకోర్టుకు వీధివ్యాపారులు…!
ఇండీకూటమి ఆందోళనలతో ఢిల్లీ కొన్నిరోజులపాటు రణరంగంలా మారింది. మరీ ముఖ్యంగా కన్నాట్ ప్లేస్ ఇతరప్రాంతాలను పోలీసులు దిగ్భందనం చేశారు. దీనికి తోడు కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనలు.. ఆప్రాంతాలన్ని దుర్భేధ్యంగా మార్చేశాయి. ఫలితంగా ప్రజలు అటు వైపు వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. ఈ పరిణామం దేశరాజకీయాల్లో కీలకంగా మారింది. అయితే ఇది.. వీధి వ్యాపారులకు మాత్రం గట్టి దెబ్బే కొట్టింది.
‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ప్రతిపాదించిన ‘లెహ్రా దో తిరంగా’ నిరసన కార్యక్రమం కారణంగా ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో సెంట్రల్ పార్క్‌ను మూసివేయడాన్ని వ్యతిరేకిస్తూ వ్యాపారులు .. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వ్యాపారుల పిటిషన్ పై తక్షణ విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, ఈ మూసివేత వల్ల చిన్న వ్యాపారులపై పడే ప్రభావం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరిణామంతో తమకు రోజుకు సుమారు రూ. 200 కోట్ల నష్టం వాటిల్లుతోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ కిరాణా కమిటీ, ఢిల్లీ ఐరన్ అండ్ హార్డ్‌వేర్ మర్చంట్ అసోసియేషన్ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది జై అనంత్ దేహాద్రాయ్.. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ముందు నేడు వాదనలు వినిపించారు.

న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) అర్ధరాత్రి వేళ పార్క్‌ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిందని, పండగ సీజన్లో ఈ నిర్ణయం వల్ల వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోయి, తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన సీజేఐ సూర్యకాంత్.. “ఈ విషయంలో సంబంధిత వర్గాలన్నింటిలోనూ మంచి ఆలోచన వస్తుందని మేము ఆశిస్తున్నాము. పండగ రోజుల్లో చిన్న దుకాణదారులు తమ జీవనోపాధిని ఎలా సంపాదించుకుంటారో మాకు తెలుసు. వారి కుటుంబాలు ఎదుర్కొనే కష్టాలు, ఇబ్బందులు మాకు అర్థమవుతాయి” అని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో జస్టిస్ బాగ్చీ జోక్యం చేసుకుంటూ.. నిరసన తెలిపే హక్కు, శాంతిభద్రతల పరిరక్షణ, వ్యాపారం చేసుకునే హక్కు పరస్పరం ముడిపడి ఉంటాయని అన్నారు. ఒకవేళ ప్రభుత్వం విధించిన ఆంక్షలు అహేతుకమైనవని, వాటి వల్ల వ్యాపారులకు చట్టవిరుద్ధంగా నష్టం వాటిల్లిందని తర్వాత తేలితే, రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి కోర్టు నష్టపరిహారం ఇప్పించవచ్చని ఆయన స్పష్టం చేశారు.








