మతమార్పిడిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
హిందూ సామాజిక వర్గం నుండి ఇతర మతాల్లోకి మారే వారి రిజర్వేషన్ల అర్హతపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. హిందూ మతంలోని వెనుకబడిన వర్గాల (BC) నుండి ఇస్లాంలోకి మారిన వ్యక్తులకు బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిం (BCM) కోటా కింద రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తించవంటూ గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం పూర్తిగా సమర్థించింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది.
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు (MBC), డీనోటిఫైడ్ కమ్యూనిటీలు మరియు షెడ్యూల్డ్ కులాలు (SC) నుండి ఇస్లాంలోకి మారిన వారికి వెనుకబడిన ముస్లిం కేటగిరీ కింద కమ్యూనిటీ సర్టిఫికెట్లు జారీ చేయవచ్చంటూ తమిళనాడు ప్రభుత్వం 2024 మార్చిలో ఒక జీవోను తీసుకువచ్చింది. అయితే, ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, కేవలం మతం మారినంత మాత్రాన ఒక వ్యక్తి ఆయా రాష్ట్రాల్లో అధికారికంగా గుర్తించబడిన వెనుకబడిన ముస్లిం సామాజిక వర్గాల్లోకి స్వయంచాలకంగా సభ్యుడు కాలేరని మద్రాస్ హైకోర్టు సదరు జీవోను కొట్టివేసింది.
హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా ప్రభుత్వానికి గట్టి చుక్కెదురైంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగ నిబంధనలను ఉటంకిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. “ఒక వ్యక్తి హిందూ సామాజిక వ్యవస్థ నుండి ముస్లిం లేదా క్రిస్టియన్ వంటి హిందూయేతర సామాజిక వ్యవస్థలోకి మారినప్పుడు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కింద లభించే రిజర్వేషన్ ఫలాలను కేవలం మతమార్పిడికి ముందు ఉన్న సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా క్లెయిమ్ చేయలేరు” అని కోర్టు స్పష్టం చేసింది. మతమార్పిడి అనేది హిందూ సామాజిక క్రమంతో ఉన్న చట్టపరమైన పునాదిని పూర్తిగా తెంచివేస్తుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో మతమార్పిడిలు, రిజర్వేషన్ల వర్తింపుపై సుదీర్ఘకాలంగా సాగుతున్న చర్చలకు ఈ తీర్పు చట్టపరంగా ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లయింది.








