సీఈసీ రాజీనామాకు విపక్ష ఇండీ కూటమి పట్టు.. దేశరాజధానిలో నిరసన పర్వం..!
ఓట్ చోరీ.. సర్ సవరణల్లో అవకతవకలు.. సీఈసీ రాజీనామా.. ఈ మూడు అంశాలే
ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తున్నాయి. వారం రోజులకు పైగా ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆందోళనలతో హోరెత్తిపోయింది. ఓవైపు విపక్ష ఇండీ కూటమికి రాహుల్ నేతృత్వం వహించగా.. సామాజిక సంస్థలు, విద్యార్థులు, కాక్రోచ్ పార్టీ.. ఇలా అన్ని ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి. అరెస్టులు.. నిర్భందాలు తమను ఆపలేవంటున్నారు విపక్షనేతలు. అంతేకాదు.. ఏకంగా ఢిల్లీ పోలీసుల చర్యలపై కోర్టులను ఆశ్రయిస్తున్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విపక్ష కూటమి నేతలు, విద్యార్థి సంఘాల ఆందోళనలు… ఉగ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా కాక్రోచ్ జనతాపార్టీ.. తమ ఆందోళనలతో అట్టుడికిస్తోంది. దీనిలో భాగంగా సీజేపీ ఫౌండర్ అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాకు తోడు నేహ బొరా లాంటి కార్యకర్తలు.. దీక్షలు, ఆందోళనలు విజయవంతం చేసేందుకు తీవ్రంగాప్రయత్నించారు. ఈప్రయత్నంలో అరెస్టులు, విడుదల జరిగాయి.
విపక్ష ఇండీ కూటమి, సామాజిక సంస్థల ప్రతినిధులు, విద్యార్థి సంఘనేతలకు.. తన నివాసంలో రాహుల్ టీ పార్టీ ఇచ్చారు. దీని తర్వాత మాట్లాడిన రాహుల్.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఓట్ చోరీ జరిగిందని.. దానికి ప్రధాని మోడీ, అమిత్ షా.. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ సూత్రధారులని ఆరోపించాయి. మోడీ వ్యూహకర్త కాగా.. దాన్ని అమలు చేస్తోంది అమిత్ షా అని.. వీరికి ఈసీ సహకరిస్తున్నారని ఆరోపించారు ఇండీకూటమి నేతలు..
ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యమన్న రాహుల్..
దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఐక్యంగా పోరాడతామని విపక్ష ‘ఇండియా’ కూటమి (INDIA Alliance), పౌరసంఘాలు ప్రతిజ్ఞ చేశాయి. ఈ విషయంలో రాజకీయ, ప్రజా ప్రతిఘటన కొనసాగుతుందని.. కచ్చితంగా విజయం సాధిస్తామన్నాయి.ఓటు చోరీకి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు రాహుల్ గాంధీ.
‘‘సుప్రీంకోర్టు, సీజేఐ, న్యాయ వ్యవస్థపై మాకు అత్యంత గౌరవం ఉంది. తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తాయని ఆశిస్తున్నాం. విజయం సాధించేవరకు రాజకీయ, ప్రజాపోరాటం కొనసాగుతుంది. రాజ్యాంగాన్ని దెబ్బతీసి ఎవరూ తప్పించుకోలేరు. ఓట్ల చోరీకి పాల్పడిన వారిని విడిచిపెట్టబోం. ప్రధాని మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ తదితరుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. సోమవారం సుప్రీంకోర్టుకు నిర్వహించిన ర్యాలీలో కనిపించిన దృశ్యం కేవలం పార్టీల ప్రదర్శన కాదు. అది దేశ ప్రజల గొంతుక. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ఈ పోరాటంలో వేర్వేరు నిరసనలంటూ ఏమీ లేవు. అంతా ఏకతాటిపై ఉన్నాం’’ అని రాహుల్ పేర్కొన్నారు.
మీ చేతకానితనానికి సాకులు వెతకొద్దు: అధికార ఎన్డీఏ
హస్తినలో రోజుల తరబడి ఉధృతంగా విపక్ష ఇండీకూటమి ఆందోళనలు నిర్వహించడంపై.. అధికార ఎన్డీఏ మండిపడింది. తమ ఓటములకు వారు సాకులు వెతుకుతున్నారని ఆరోపించింది.ఓట్ల సవరణకు ఉద్దేశించిన ‘సర్’ లేనప్పుడు కూడా కాంగ్రెస్ ఓడిపోయిందని… 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్షా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ప్రతిసారీ ఆ పార్టీకి ఓటమేనని ఎద్దేవా చేశారు. ఆయన నాయకత్వ ఫలితాల్ని ‘సర్’పై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేశ ప్రజలంతా భాజపా, ఎన్డీయే, ప్రధాని నరేంద్ర మోదీలతోనే ఉన్నారని షా ధీమా వ్యక్తంజేశారు.
కాంగ్రెస్ పనితీరు పేలవం: అమిత్ షా
సీఈసీ జ్ఞానేశ్కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన తర్వాత తొలిసారి అమిత్ షా స్పందించారు. ‘‘ప్రజలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ అనుసరిస్తూ వస్తున్న ప్రతికూల రాజకీయాలు ఆ పార్టీకి ప్రయోజనం కలిగించవు. అనేక రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, స్థానికసంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పనితీరు పేలవంగా ఉంది. కాంగ్రెస్కు ముఖ్య నేతగా, కొన్నాళ్లు అధ్యక్షుడిగా, ప్రస్తుతం లోక్సభ విపక్ష నేతగా ఉన్న రాహుల్ హయాంలో వరసగా అన్ని ఎన్నికల్లోనూ ఆ పార్టీ పరాజయం మూటగట్టుకుంటూ వస్తోంది. దానిపై మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
అబద్ధాలు పదేపదే చెప్పి, మీడియా దృష్టిలో పడేందుకు కల్పిత ప్రయత్నాలు చేస్తుంటే మీరు ప్రజల విశ్వాసాన్ని పొందలేరు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. అయినా రాహుల్ను నేనొకటి సూటిగా అడగాలనుకుంటున్నాను. ఇదంతా ‘సర్’ ఫలితమేనా? 2024 తర్వాతేగా సర్ మొదలైంది? మరి అంతకుముందు కూడా మీ పార్టీ ఓడింది కదా? చొరబాటుదారుల్ని ఓటర్లుగా చేర్చాలనే రాహుల్ ఆలోచనల గురించి దేశ ప్రజలకు తెలుసు. తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఆధిక్యంతో ఎన్డీయే గెలవడం, వరసగా నాలుగోసారి కాంగ్రెస్ ఓటమిపాలు కావడం ఖాయమన్నారు.
ఢిల్లీలో 14 రాజకీయ పార్టీలకు చెందిన 8 వేల మంది కార్యకర్తలు ఒకటిన్నర కి.మీ. మేర గుమిగూడినంత మాత్రాన అది రాహుల్ మన దేశం తరఫున వినిపించిన వాణి అయిపోదని అమిత్ షా ఎద్దేవా చేశారు. ‘‘ప్రజల మనోభావాలు తెలుసుకోవాలంటే పొలాలు, గ్రామాలు, కొండకోనలకు వెళ్లాలి. రాహుల్ అక్కడకు వెళ్లలేరు. బిహార్, యూపీ, తమిళనాడు సహా అనేక రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించారు. ఒకప్పటి కంచుకోటలాంటి గుజరాత్లో గత 41 ఏళ్లుగా ఒక్క ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ ఎందుకు గెలవలేకపోతోంది? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం ఇది’’ అని షా తెలిపారు.
ఆందోళనలు ఎలా మొదలయ్యాయంటే….?
ఓటర్ల జాబితాల ప్రక్షాళన ప్రక్రియపై వచ్చిన అనుమానాలు సెప్టెంబర్ చివరి నుంచి నిరసనలకు దారితీశాయి.సెప్టెంబర్ 25 నుంచి: ఓటర్ల జాబితాల సవరణలో అక్రమాలు జరిగాయంటూ వార్తలు, ఆరోపణలు వెలువడిన తర్వాత నిరసనలు మొదలయ్యాయి.అక్టోబర్ 4 నాటికి: ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో యువత, విపక్ష పార్టీల కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అక్టోబర్ 6: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇండియా కూటమి నేతలు ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ర్యాలీ చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.అక్టోబర్ 10: యువజన ఉద్యమం చేపట్టిన ర్యాలీని అడ్డుకునేందుకు ఢిల్లీలో భద్రతను భారీగా పెంచారు. వేలాది మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు..అక్టోబర్ 12: విపక్ష నేతలు సుప్రీంకోర్టు వైపు ర్యాలీ నిర్వహించి, ఓటర్ల జాబితాల వివాదంపై న్యాయపరమైన జోక్యం కోరారు.
ఓట్ల తొలగింపే కారణం..!
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన Special Intensive Revision (SIR) ప్రక్రియలో దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా ఓటరు ఎంట్రీలు తొలగించబడ్డాయని వార్తా నివేదికలు పేర్కొన్నాయి. వాటిలో మరణించినవారు, వేరే ప్రాంతాలకు వెళ్లినవారు, ఆచూకీ లభించనివారు ఉన్నారని ఎన్నికల సంఘం వివరిస్తోంది.కానీ విపక్షాల అభ్యంతరం వేరేగాఉంది..: అర్హులైన ఓటర్ల పేర్లు కూడా తొలగిపోయి ఉంటే, ముఖ్యంగా మైనారిటీలు, పేదలు, వలస వెళ్లే ప్రజలు ప్రభావితమైతే, అది ఎన్నికల నిష్పాక్షికతను దెబ్బతీస్తుందని వారు వాదిస్తున్నారు. ఈ ప్రక్రియ అధికార బీజేపీకి ప్రయోజనం కలిగించేలా ఉందన్న ఆరోపణను ఎన్నికల సంఘం, బీజేపీ రెండూ ఖండిస్తున్నాయి.
అక్టోబర్ 14 నాటికి పరిస్థితి పూర్తిగా సద్దుమణిగినట్లు చెప్పలేం. అయితే ఇండియా కూటమి ప్రతిరోజూ చేపడుతున్న భారీ ర్యాలీలను కొంత తగ్గించి, న్యాయపోరాటం, తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది.
ర్యాలీలకు తాత్కాలిక విరామం: అక్టోబర్ 13న జరిగిన ఇండియా కూటమి నేతల సమావేశంలో రోజువారీ నిరసనలను తగ్గించి, అవసరాన్ని బట్టి మళ్లీ ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అనుమతి లేకుండా ప్రదర్శన నిర్వహించడం, బారికేడ్లకు నష్టం కలిగించడం వంటి ఆరోపణలతో పోలీసులు కేసులు నమోదు చేశారు. నిరసనలకు సంబంధించిన 500కు పైగా సోషల్ మీడియా పోస్టులను తొలగించాలని కూడా పోలీసులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
జంతర్ మంతర్ లో నిరసనలు ఇక కుదరవు…
ఈ ప్రాంతాన్ని అధికారిక నిరసన స్థలంగా గుర్తించే హోదాను పోలీసులు తొలగించడంతో కొత్త వివాదం మొదలైంది. అక్టోబర్ 13న అక్కడికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన యువజన ఉద్యమ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విపక్షాలు, విద్యార్థులు తీవ్రంగా మండిపడ్డారు. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాలరాసే హక్కుగా వారు అభివర్ణించారు. అయితే నిరసనల కారణంగా ప్రజాజీవితం ఇబ్బందుల పాలవుతోందని అందుకే దాన్ని మార్చడం జరుగుతోందని కేంద్రం చెబుతోంది.
మరోవైపు..నిరసనల సమయంలో పోలీసుల చర్యలు, మెట్రో సేవలకు అంతరాయం, జర్నలిస్టులపై దాడుల ఆరోపణలకు సంబంధించి కేంద్రం నుంచి సమాధానం కోరుతూ సుప్రీంకోర్టు అక్టోబర్ 15 వరకు గడువు ఇచ్చింది.
ప్రస్తుతం పోరాటం మూడు స్థాయుల్లో సాగుతోంది: వీధి నిరసనలు, కోర్టులో న్యాయపోరాటం, కేంద్రం–విపక్షాల మధ్య రాజకీయ విమర్శలు.
ఇండియా కూటమి ఏం చెబుతోంది?
విపక్షాల ప్రధాన ఆరోపణ ఏమిటంటే, ఓటర్ల జాబితాల సవరణలో అక్రమాలు జరిగి, అర్హులైన ఓటర్ల హక్కులు దెబ్బతిన్నాయని. రాహుల్ గాంధీ దీనిని ‘ఓట్ చోరీ’గా అభివర్ణిస్తూ, ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వారి డిమాండ్లను నాలుగు అంశాలుగా చూడవచ్చు:
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా: ప్రధాన ఎన్నికల కమిషనర్ బాధ్యత వహించాలని విపక్షాలు కోరుతున్నాయి.
SIR ప్రక్రియపై సమీక్ష: ఓటర్ల పేర్ల తొలగింపులో పారదర్శకత ఉండాలని, అర్హులైన ఓటర్లకు న్యాయం జరగాలని అంటున్నాయి.ఎన్నికల సంఘం స్వతంత్రత: ఎన్నికల నిర్వహణలో రాజకీయ జోక్యం లేదా పక్షపాతానికి తావు ఉండకూడదని వాదిస్తున్నాయి.కాంగ్రెస్తో పాటు ఇతర ఇండియా కూటమి పార్టీలు, విద్యార్థి సంఘాలు, పౌరసమాజ ప్రతినిధులను కలుపుకొని ఉద్యమాన్ని కొనసాగించాలని యోచిస్తున్నాయి.
దీనికి ఎన్డీఏ, బీజేపీ ఎలా బదులిస్తున్నాయి?
ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ తన ఎన్నికల ఓటములకు ఇతరులను బాధ్యులను చేస్తోందని బీజేపీ విమర్శిస్తోంది. రాహుల్ గాంధీ తన పార్టీ ఎన్నికల ఫలితాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని, SIRను రాజకీయంగా ఉపయోగించుకోవద్దని అమిత్ షా సూచించారు..
మరణించినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్నవారు, అర్హత లేని వ్యక్తుల పేర్లను తొలగించడం ఎన్నికల ప్రక్రియను శుభ్రపరిచే చర్య అని ఎన్నికల సంఘం చెబుతోంది.అక్రమాల ఆరోపణలను ఖండించడం: బీజేపీకి ప్రయోజనం కలిగించేలా పేర్లు తొలగించారన్న ఆరోపణను ఎన్నికల సంఘం, బీజేపీ తిరస్కరిస్తున్నాయి.
ఓటర్ల జాబితా వివాదాన్ని కాంగ్రెస్ రాజకీయ పోరాటానికి వాడుకుంటోందని, ఎన్నికల సంఘంపై ప్రజల్లో అనుమానాలు పెంచుతోందని బీజేపీ నేతలు అంటున్నారు. నిరసన హక్కును ప్రభుత్వం పూర్తిగా తిరస్కరిస్తోందని చెప్పలేం. అయితే ప్రజా శాంతిభద్రతలు, అనుమతులు, నిర్దేశిత ప్రాంతాల నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
ఈ వివాదంలో న్యాయపరమైన పరిణామాలు కూడా ముఖ్యమైనవి.అక్టోబర్ 5న, ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నారా లేదా అన్న అంశంపై సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం సమాధానం కోరింది. వార్తాపత్రిక కథనం ఒక్కటే ఆధారంగా తుది నిర్ణయం ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.








