మార్వాడీల వ్యాపారం సక్సెస్ వెనుక.. ఈ 1000 రోజుల రూల్ తెలుసా!
సొంతంగా వ్యాపారం ప్రారంభించి మంచి ఆదాయం సంపాదించాలని చాలామంది కలలు కంటారు. కానీ పెట్టుబడి పెట్టిన కొన్ని నెలల్లోనే లాభాలు రాకపోతే నిరాశ చెందుతారు. వ్యాపారాన్ని కొనసాగించాలా వద్దా అనే సందేహంలో పడిపోతారు. ఇలాంటి వారికి ఓపిక, క్రమశిక్షణ ప్రాముఖ్యతను గుర్తుచేసే వ్యాపార ఆలోచనే మార్వాడీ 1000 రోజుల రూల్ (1000 Days Rule).
1000 రోజుల రూల్ అంటే ఏమిటి?
కొత్త వ్యాపారం స్థిరపడటానికి దాదాపు 1000 రోజులు, అంటే సుమారు మూడు సంవత్సరాల సమయం కేటాయించాలనేది ఈ సూత్రంలోని ప్రధాన భావన. ఈ కాలంలో తక్షణ లాభాల కంటే కస్టమర్ల నమ్మకం, మార్కెట్ అవగాహన, వ్యాపార అభివృద్ధిపై దృష్టి పెట్టాలి.
మొదటి 365 రోజులు.. వ్యాపారాన్ని అర్థం చేసుకోవడం
మొదటి ఏడాదిలో కస్టమర్ల అవసరాలు, పోటీదారుల వ్యూహాలు, ఉత్పత్తుల డిమాండ్ను పరిశీలించాలి. రోజువారీ అమ్మకాలు, ఖర్చులు, కస్టమర్ల అభిప్రాయాలను నమోదు చేసుకుంటూ వ్యాపారంలో అవసరమైన మార్పులు చేసుకోవాలి.
366 నుంచి 730 రోజులు.. నమ్మకాన్ని పెంచుకోవడం
రెండో ఏడాదిలో నాణ్యమైన సేవలు, సరైన ధరలు, సమయానికి ఉత్పత్తుల సరఫరాపై దృష్టి పెట్టాలి. కస్టమర్లు మళ్లీ వచ్చేలా మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలి. ఖర్చులను నియంత్రిస్తూ అమ్మకాల ద్వారా వచ్చే లాభాలను విశ్లేషించాలి.
ఇవి కూడా చదవండి
731 నుంచి 1000 రోజులు.. లాభాలపై దృష్టి
మూడో దశలో ఎక్కువగా అమ్ముడయ్యే ఉత్పత్తులను గుర్తించి వాటిపై దృష్టి పెట్టాలి. ఒక్కో అమ్మకంపై వచ్చే వాస్తవ లాభం, నిర్వహణ ఖర్చులు, నగదు ప్రవాహాన్ని పరిశీలించాలి. వ్యాపారం ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాతే విస్తరణ గురించి ఆలోచించాలి.
మెడికల్ షాప్ వ్యాపారి విజయగాథ
2010లో మహారాష్ట్రలో ఓ మార్వాడీ వ్యాపారి ప్రారంభించిన మెడికల్ షాప్ మొదట్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. అయినప్పటికీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించాడు. కాలక్రమంలో మూడు మెడికల్ షాపుల యజమానిగా ఎదిగిన ఆయన కథ ఈ సూత్రానికి ఉదాహరణగా ప్రచారంలోకి వచ్చింది.
ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవడం, వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా వినియోగించడం, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మారడం వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడతాయి. అయితే 1000 రోజులు పూర్తయితే తప్పకుండా లాభాలు వస్తాయని కాదు. నష్టాలను సమీక్షిస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.








