టాటా సన్స్ వ్యవహారాల్లో ట్రస్ట్ జోక్యం పెరుగుతోందా…?
టాటా సన్స్ వ్యవహారం మరింత ముదిరిందా.. ట్రస్టుల్లో అంతర్గత విభేదాలు ..ప్రభుత్వం దగ్గరకు చేరాయా.. అంటే అవుననే చెప్పాలి. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (ఎస్‌డీటీటీ) పాలన, టాటా సన్స్ వ్యవహారాల్లో దాని పాత్రపై విచారణ జరపాలని టాటా ట్రస్టుల వైస్ ఛైర్మన్, ఎస్‌డీటీటీ ట్రస్టీ విజయ్ సింగ్ మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్‌ను కోరారు. టాటా సన్స్ వాణిజ్య, వ్యూహాత్మక వ్యవహారాల్లో ట్రస్ట్ జోక్యం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
టాటా సన్స్‌లో ఎస్డీటీటీకి భారీ వాటా ఉన్నంత మాత్రాన వాణిజ్య సంస్థ తరహాలో ట్రస్ట్ వ్యవహరించకూడదని విజయ్ సింగ్ తన లేఖలో పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది. ట్రస్ట్ వాణిజ్య కార్యకలాపాల్లో పాల్గొంటే పన్ను మినహాయింపులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
విచారణలో ఆరోపణలకు ఆధారాలు ఉంటే సంబంధిత ట్రస్టీలపై చర్యలు తీసుకోవాలని సింగ్ కోరారు. అవసరమైతే ట్రస్టీలను సస్పెండ్ చేయడం లేదా తొలగించడం, కొత్త ట్రస్టీల నియామకం వంటి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఎస్‌డీటీటీ బోర్డు సమావేశాలు, కీలక నిర్ణయాలపై ఆంక్షలు విధించాలని కూడా కోరినట్లు ‘ఎకనామిక్ టైమ్స్’ తెలిపింది.
ఇవి కూడా చదవండి
ఇదే అంశంపై మరో వైస్ ఛైర్మన్ వెంకూ శ్రీనివాసన్ కూడా సెప్టెంబర్ 30న ఛారిటీ కమిషనర్‌ను ఆశ్రయించారు. ఎస్‌డీటీటీ పాలనలో లోపాలు ఉన్నాయంటూ ఆయన విచారణ కోరారు. నోయల్ టాటా ట్రస్టీగా కొనసాగడం, ట్రస్టుల ఛైర్మన్‌గా ఆయన పాత్ర, నోయల్ కుమారుడు నెవిల్ టాటాను ట్రస్టీగా నియమించడంపైనా శ్రీనివాసన్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన వినాలని టాటా ట్రస్టులు ఛారిటీ కమిషనర్‌ను కోరాయి.
టాటా సన్స్ భవిష్యత్ నిర్మాణంపై కూడా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ సొల్యూషన్స్, టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్‌ను టాటా సన్స్‌లో విలీనం చేయాలని టాటా ట్రస్టులు ప్రతిపాదించాయి. ఈ మార్పుతో టాటా సన్స్ నియంత్రణ సంస్థల వర్గీకరణ మారే అవకాశం ఉందని ట్రస్టులు పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదనకు ఆర్బీఐ అనుమతి అవసరం.








