అట్టికా గోల్డ్‌పై ఈడీ పంజా.. ఈడీ కీలక ప్రకటన..!
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ గోల్డ్ ట్రేడింగ్ సంస్థగా పేరుపొందిన అట్టికా గోల్డ్(Attica Gold) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విరుచుకుపడ్డారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002లోని సెక్షన్ 17 కింద ఈ నెల 23, 24 తేదీలలో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఈ సంస్థకు చెందిన కార్యాలయాలు, నివాసాలపై అధికారులు సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సంచలన దాడులకు సంబంధించిన అధికారిక వివరాలను ఈడీ తాజాగా ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.
బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అట్టికా గోల్డ్ సంస్థకు చెందిన హెడ్ ఆఫీస్, బ్రాంచ్‌లతో పాటు ఆ సంస్థ డైరెక్టర్లు, ప్రధాన షేర్ హోల్డర్లు, యాజమాన్యంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తుల ఇళ్లలో ఈ సోదాలు జరిగాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో మొత్తం 16 కీలక ప్రాంతాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో రంగంలోకి దిగి సోదాలు నిర్వహించాయి. వివిధ పోలీస్ స్టేషన్లలో అట్టికా గోల్డ్ సంస్థపై నమోదైన పలు ఎఫ్ఐఆర్లు (FIRs), చార్జ్షీట్ల ఆధారంగా ఈడీ ఈ మనీ లాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి
ఈ సంస్థ నిర్వాహకులు నిరంతరం చోరీకి గురైన బంగారు ఆభరణాలు మరియు వస్తువులను అక్రమంగా కొనుగోలు చేస్తూ, వాటి ద్వారా భారీ మొత్తంలో నేరపూరిత ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కంపెనీ ప్రమోటర్లు పి.ఎస్. ఆయూబ్ అలియాస్ బొమ్మనహళ్లి బాబుతో పాటు ఇతరులు ఈ అక్రమ లావాదేవీల వెనుక ఉన్నట్లు ఈడీ పేర్కొంది. ఈ రెండు రోజుల దాడుల్లో భారీగా నగదు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు మరియు వెండి వస్తువులను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల సమయంలో సంస్థకు చెందిన కొందరు కీలక ఎగ్జిక్యూటివ్‌లు అధికారుల దర్యాప్తునకు సహకరించకుండా పరారైనట్లు తెలుస్తోంది.








