ఉదయగిరి సభలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల ప్రగతి సరికొత్త వేగం పుంజుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురం వేదికగా నిర్వహించిన ‘పల్లె పండుగ 3.0’ భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి కోసం ఏకంగా రూ. 11,085 కోట్ల అంచనా వ్యయంతో భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మాట్లాడుతూ.. ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టుకున్నామని ఎమోషనల్ గా ప్రకటించారు. “ఎన్నికల్లో మీరు వేసిన ఒక్క ఓటుతో రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో మళ్లీ నిలబెట్టాం. ప్రజలు వేసిన ఓటు ఎంతమాత్రం వృధా కాలేదు” అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారంతో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోందని ఆయన వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
కూటమి ప్రభుత్వం నడుస్తున్న తీరును వివరిస్తూ.. “నాకు దశాబ్దాల సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉంది.. దానికి తోడు తమ్ముడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హుషారు, ఆలోచనలు తోడయ్యాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మనకు పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందిస్తోంది. ఈ ముగ్గురి కలయికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల అరాచక పాలనలో పూర్తిగా ధ్వంసమైన గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ఈ పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్లు చెప్పారు.
గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన పంచాయతీ వ్యవస్థలకు ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో పూర్వవైభవం తెస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఈ మూడో విడత పల్లె పండుగ కింద రూ. 10,250 కోట్లతో ఏకంగా 15,500 కిలోమీటర్ల మేర గ్రామీణ సిమెంట్, తారు రహదారులను నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. అలాగే రూ. 300 కోట్లతో 22,000 మినీ గోకులాలు, రూ. 110 కోట్లతో 1,000 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణ పనులను చేపడుతున్నట్లు వివరించారు. లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలను సకాలంలో అందిస్తూనే, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధన దిశగా ప్రతి పల్లెను ఒక మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.








