పాలనలో ఏపీ సరికొత్త రికార్డు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా విధానాల్లో సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పడింది. విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ తొలి సదస్సు’ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సామర్థ్య పెంపుదల, నైపుణ్యాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవగా, కర్ణాటక ద్వితీయ స్థానంలో, ఒడిశా తృతీయ స్థానంలో నిలిచాయి. విజేతలుగా నిలిచిన ఈ మూడు రాష్ట్రాల అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తన చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డులను అందజేశారు.
ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఆధునిక నైపుణ్యాలే రాష్ట్రాభివృద్ధికి అసలైన చోదకశక్తి అని స్పష్టం చేశారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా ప్రభుత్వ పాలనా విధానాలను మరింత సరళీకృతం చేయవచ్చని, తద్వారా అవినీతి రహిత సేవలను ప్రజలకు అందించవచ్చని తెలిపారు. పౌర సేవల్లో నాణ్యతను పెంచడమే ప్రభుత్వ సామర్థ్యాల పెరుగుదలకు అసలైన గీటురాయి అని, అధికారులు నిరంతరం తమ నైపుణ్యాలను అప్గ్రేడ్ చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి
ఇక ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమం ఉదయగిరి నియోజకవర్గంలో వైభవంగా ప్రారంభమైంది. కాకొల్లువారిపాలెంలో నిర్వహించిన ఈ క్షేత్రస్థాయి ప్రగతి ఉత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సంయుక్తంగా పాల్గొన్నారు. గ్రామాల రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా ఉపాధి హామీ నిధులు, సిమెంట్ రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు ఈ వేదిక ద్వారా శ్రీకారం చుట్టారు.








