సీపీఎంకి దగ్గరవుతున్న మమతా బెనర్జీ.. జాగ్రత్తపడుతున్న సీపీఎం
దేశంలో సర్ ప్రక్రియ వేడి రగులుతోంది. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ చుట్టే రాజకీయం తిరుగుతోంది. ఈ నేపథ్యంలో బెంగాల్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రధాన ప్రత్యర్థులుగా, ఉప్పూ నిప్పుగా వున్న టీఎంసీ, వామపక్షాలు ఇప్పుడు ఒక్కటవుతున్నట్లు తెలుస్తోంది. వామపక్షాలతో సయోధ్య కుదుర్చుకోవడానికి మాజీ సీఎం మమతా బెనర్జీ సిద్ధమయ్యారు.
వామపక్షాలతో సయోధ్య కుదుర్చుకోవడానికి ఏకంగా మాజీ సీఎం మమతా బెనర్జీయే ఓ అడుగు ముందుకు వేశారు. పార్టీతో సయోధ్య కోసం, కలిసి పనిచేసే విషయంలో మాజీ సీఎం మమతా బెనర్జీ సీపీఎం ప్రధాన కార్యదర్శి బేబీకి ఫోన్ చేశారు. అయితే.. సీపీఎం మాత్రం అంత చురుగ్గా స్పందించడం లేదు. నిజం చెప్పాలంటే బెంగాల్ లో సీపీఎం అధికారం వున్న సమయంలో సీపీఎం పార్టీకి, ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. అత్యంత కఠిన ప్రత్యర్థిగా రాజకీయాలు చేశారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 34 ఏళ్ల నాటి వామపక్ష ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ ఓడించింది.
అయితే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులుగా ఉన్నవారే ఆమెకు వ్యతిరేకంగా మారారు. పార్టీలో చీలిక ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో, మమతా బెనర్జీ ఇప్పుడు తన పాత ప్రత్యర్థులను తిరిగి దగ్గరకు తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
వాస్తవానికి, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తొలగింపు డిమాండ్‌కు సంబంధించి వ్యూహరచన చేసేందుకు ‘ఇండియా’ (INDIA) కూటమి కీలక సమావేశం సెప్టెంబర్ 30న ఢిల్లీలో జరగనుంది. దీనికి ముందు, మమతా బెనర్జీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరియు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీలతో వేర్వేరుగా ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారు.అంతేకాకుండా, ఎవరు ‘నీలం’ (blue) లేదా ఎవరు ‘ఎరుపు’ (red) అని చూడాల్సిన అవసరం ఇక లేదని మమతా బెనర్జీ ఒక బహిరంగ సభలో స్పష్టం చేశారు. “దేశమంతా ఏకమైంది. మనం కలిసి పోరాడుతాం; ఎవరు ఎరుపు, నీలం లేదా పసుపు రంగుకు చెందినవారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి,” అని ఆమె అన్నారు.
అయితే.. మాజీ సీఎం మమతా బెనర్జీ స్నేహ హస్తం చాచడంతో సీపీఎం అలర్ట్ అయ్యింది. రాజ్యాంగబద్ధ సంస్థలను పరిరక్షించేందుకు కలిసి పనిచేయడం అంటే ఎన్నికల పొత్తు అని అర్థం కాదని సీపీఎం స్పష్టం చేసింది. రాజ్యాంగ సంస్థలు మరియు ఎన్నికల కమిషన్‌కు పొంచి ఉన్న ముప్పు గురించి టీఎంసీతో సహా పలు పార్టీలకు లేఖలు రాసినట్లు మహమ్మద్ సలీం పేర్కొన్నారు. ఇప్పుడు ఈ విషయంపై మమతా బెనర్జీ తన వైఖరిని స్పష్టం చేయాలని సీపీఎం కోరుతోంది.
రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అయితే, ప్రస్తుతానికి మాత్రం CPI(M) చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో TMC భారీగా నష్టపోవడంతో, రాష్ట్రంలో గతంలో కోల్పోయిన రాజకీయ పట్టును తిరిగి సాధించే అవకాశాలు CPI(M)కి మెరుగుపడ్డాయి. మమతతో నేరుగా పొత్తు పెట్టుకుంటే, తిరిగి దక్కించుకున్న ఈ స్థానాన్ని మళ్లీ కోల్పోయే ప్రమాదం ఉందని ఆ పార్టీ ఆందోళన చెందుతోంది.
నిజానికి మాజీ సీఎం మమత రాజకీయంగా చాలా ఇబ్బందుల్లో వున్నారు. సొంత కేడర్, ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. కాంగ్రెస్ కూడా విలీనం అన్న షరతు విధించింది. దీంతో కాంగ్రెస్ కి దూరంగా వుంటోంది. రాజకీయంగా అయినా, మరో రకంగా అయినా.. మమత ఒంటరయ్యారు. దీంతో సరైన టైమ్ ను చూసుకున్న మమత.. ఇప్పుడు సీపీఎంతో కలిసి నడవాలని, సీపీఎం సపోర్ట్ తీసుకోవాలని సడెన్ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా పరోక్షంగా కాంగ్రెస్ కి బ్రేక్ వేయవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది.








