కేంద్ర ప్రభుత్వం ముందు సీడబ్ల్యూసీ ఐదు ప్రధాన డిమాండ్లు..
న్యూఢిల్లీ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను టార్గెట్ చేసింది. ఆయన్ను పదవీ నుంచి తొలగించే విషయంలోనే తీవ్రంగా చర్చించింది. వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే తొలగించాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు. ఈ అవకతవకలకు ప్రధాని మోదీయే బాధ్యత వహించాలని కూడా డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పునాదులను, రాజ్యాంగ బద్ధమైన స్వతంత్ర వ్యవస్థలను ఓ క్రమపద్ధతిలో ధ్వంసం చేస్తున్నారన్నారు. జ్ఞానేశ్ కుమార్ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. జ్ఞానేశ్ను ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపులో కుట్ర జరుగుతోందని, ఎన్నికల కమిషన్ పనితీరుపై తీవ్ర సందేహాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా ఖర్గే కేంద్రం ముందు ఐదు ప్రధాన డిమాండ్లను వుంచారు.
1. ఓటర్ల జాబితాలో మార్పుల పూర్తి వివరాలు:
ఓటర్ల జాబితాలో చేసిన ముఖ్యమైన మార్పులు, తొలగింపులు, చేర్పులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని బహిరంగం చేయాలని కాంగ్రెస్ కోరింది.
ఇవి కూడా చదవండి
2. పేరు తొలగించిన ఓటర్లకు అప్పీల్ అవకాశం:
ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించిన వ్యక్తులకు పూర్తి సమాచారం అందించి, నిర్ణయాన్ని సవాలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసింది.
3. రాజకీయ పార్టీలకు సమాచారం సులభమైన రూపంలో ఇవ్వాలి:
ఓటర్ల జాబితాలు, సంబంధిత సమాచారాన్ని రాజకీయ పార్టీలకు సులభంగా అర్థమయ్యే రూపంలో, సకాలంలో అందించాలని కోరింది.
4. తీవ్రమైన అక్రమాలపై స్వతంత్ర విచారణ:
ఓటర్ల జాబితాలో తీవ్రమైన అవకతవకలకు ఆధారాలు కనిపిస్తే స్వతంత్రంగా, నిర్దిష్ట కాలపరిమితిలో విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
5. ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత:
ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలక సమాచారం, నిర్ణయాలను మరింత పారదర్శకంగా ఉంచాలని కాంగ్రెస్ కోరింది.








