మళ్లీ నోరు జారిన కొండా సురేఖ..!
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ శైలి ఎప్పుడూ వివాదాస్పదమే. ప్రత్యర్థులపై విరుచుకుపడే విధానంలో రాజీ పడకపోవడం ఆమెకు రాజకీయంగా గుర్తింపునిచ్చినప్పటికీ, అదే దూకుడు అనేక సందర్భాల్లో ఆమె రాజకీయ భవిష్యత్తుకు శాపంగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలతో మంత్రి పదవి కోల్పోయిన చరిత్ర ఉన్నప్పటికీ, సురేఖ తన రూటు మార్చుకోవడం లేదు. ఇవాళ వరంగల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. “నోరు అదుపులో పెట్టుకోకపోతే మహిళలతో చిత్తుచిత్తుగా కొట్టిస్తాం.. ఒక్కో మహిళ నలుగురిని కొడుతుంది.. గాలిలో కత్తులు తిప్పడం మానుకోండి” అంటూ ప్రత్యర్థులకు ఆమె ఇచ్చిన హెచ్చరికలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.
కొండా సురేఖకు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సొంత పార్టీకే కాకుండా ప్రభుత్వానికీ పెద్ద తలనొప్పిగా మారాయి. ఆ వివాదాల పర్యవసానంగానే ఆమె కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురికావాల్సి వచ్చింది. సాధారణంగా ఒక నేత పదవి కోల్పోయిన తర్వాత కొంత ఆచితూచి అడుగులు వేయడం, భాషపై సంయమనం పాటించడం సహజం. కానీ, కొండా సురేఖ తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. తాజాగా వరంగల్ వేదికగా ప్రత్యర్థులను ఉద్దేశించి ఆమె వాడిన భాష, చేసిన దేహశుద్ధి హెచ్చరికలు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని సైతం మరోసారి విస్మయానికి గురిచేస్తున్నాయి. ప్రత్యర్థులను రాజకీయంగా, విధానపరంగా ఎదుర్కోవాల్సింది పోయి, ‘మహిళలతో కొట్టిస్తాం’ అంటూ వీధి పోరాటాల స్థాయికి దిగజారడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కొండా దంపతుల రాజకీయ శైలి మొదటినుంచీ దూకుడుగానే ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టు సాధించాలన్నా, ప్రత్యర్థులను కట్టడి చేయాలన్నా దూకుడు మంత్రమే సరైందని వారు భావిస్తుంటారు. అయితే, ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా, మాజీ మంత్రిగా ఉండి ఈ తరహా భాషను వాడటం కేవలం రాజకీయ బలహీనతను, అసహనాన్ని మాత్రమే సూచిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రత్యర్థులు చేస్తున్న రాజకీయ దాడిని తట్టుకోలేకనే ఆమె సంయమనం కోల్పోతున్నారా లేక తన ఉనికిని చాటుకోవడానికి కావాలనే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
మరోవైపు.. ఇదే వేదికపై నుంచే కాంగ్రెస్ నేతలంతా అంతర్గత విభేదాలు పక్కనబెట్టి సమష్టిగా పనిచేయాలని, పార్టీ ఐక్యంగా ఉంటేనే పురోగతి సాధ్యమని సురేఖ పిలుపునిచ్చారు. అయితే.. ఒకవైపు ఐక్యత, క్రమశిక్షణ గురించి మాట్లాడుతూనే.. మరోవైపు బాహాటంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని సొంత పార్టీ నాయకులే ప్రశ్నిస్తున్నారు. పార్టీ ప్రతిష్ఠను పెంచాల్సిన సీనియర్లే ఇలాంటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలిస్తే, అది క్షేత్రస్థాయిలో పార్టీకి నష్టం చేకూరుస్తుందనే ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
గతంలో చేజేతులా చేసుకున్న పొరపాట్లతోనే అధికారాన్ని దూరం చేసుకున్న సురేఖ, ఇప్పటికైనా తన పంథాను మార్చుకోకపోతే రాజకీయంగా మరింత ఒంటరిగా మారే ప్రమాదం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి దూకుడు అవసరమే కావొచ్చు.., కానీ అది సంస్కారం, హద్దులు దాటితే మొదటికే మోసం వస్తుందనే సత్యాన్ని ఆమె విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది.








