అనర్హత సరే.. దానం జీతభత్యాలు రికవరీ చేస్తారా?
ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ చుట్టూ తెలంగాణ రాజకీయాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయనపై అనర్హత వేటుపడింది. 2024 ఏప్రిల్ 23 నుంచే ఆయన్ను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆయన ఎమ్మెల్యేగానే కొనసాగుతూ వచ్చారు. జీతభత్యాలు తీసుకున్నారు. వాటిని ఇప్పుడు ఏం చేయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఎన్నికల్లో గెలిచిన కొన్ని నెలల్లోనే దానం నాగేందర్ పార్టీ మారిపోయారు. కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలంటూ కేసులు నమోదయ్యాయి. వీటిపై సుదీర్ఘ విచారణ అనంతరం సెప్టెంబర్ 18, 2026న హైకోర్టు దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. 2024 ఏప్రిల్ 23 నుంచే అనర్హత వర్తిస్తుందని స్పష్టం చేసింది.
అయితే.. నిబంధనల ప్రకారం అనర్హత కాలంలో తీసుకున్న వేతనాలు, అలవెన్సులు ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలనే డిమాండ్ ప్రజల నుండి, ప్రతిపక్షాల నుండి బలంగా వినిపిస్తోంది. అయితే.. ఆటోమేటిక్ రికవరీకి ఎలాంటి చట్టపరమైన నిబంధనలు లేవని అధికారులు చెప్తున్నారు. కోర్టు ప్రత్యేకంగా జీతం రికవరీ చేయాలని ఆదేశిస్తేనే తాము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కోర్టు జీతభత్యాల గురించి ఎలాంటి తీర్పూ ఇవ్వలేదు. కాబట్టి దానం నాగేందర్ నుంచి జీతభత్యాలు రికవరీ చేసే అవకాశం లేదని అర్థమవుతోంది.
అంతకుముందు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలగా ఎన్నికైన కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఉదంతాలను అధికారులు ఉదాహరణగా చూపుతున్నారు. వారు పదవుల్లో కొనసాగిన కాలంలో తీసుకున్న జీతభత్యాలను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదని, చట్టపరంగా సేవలు అందించిన కాలానికి వేతనం చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ, చట్టసభలను తప్పుదోవ పట్టించి, పార్టీ మారిన నేతలకు ప్రజాధనాన్ని కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న రాజకీయ విశ్లేషకుల నుండి వ్యక్తమవుతోంది.
ఈ మొత్తం ఉదంతంలో దానం నాగేందర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక పార్టీ తరఫున గెలిచి, మరో పార్టీలో చేరినప్పటికీ, శాసనసభ సభ్యుడిగా కొనసాగడం, ఆ కాలమంతా అధికారిక ప్రయోజనాలను పొందడం నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడమే అవుతుంది. అనర్హత కాలానికి కూడా జీతభత్యాలు చెల్లించి ప్రభుత్వాలు, వాటిని రికవరీ చేయలేకపోవడంపైన కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో అనర్హత కాలానికి జీతభత్యాలు తీసుకున్న దానం నాగేందర్ నైతికతపైన కూడా ప్రశ్నల వర్షం కురుస్తోంది.
చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని ప్రజాధనాన్ని రక్షించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయనే అపవాదు మూటగట్టుకుంటున్నాయి. కోర్టులు మొట్టికాయలు వేసినా, అనర్హత వేటు వేసినా నాయకులు అనుభవించిన లబ్ధిని మాత్రం వెనక్కి తీసుకోలేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో నెలకొన్న లోపాలను ఎత్తి చూపుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టసభలు కఠినమైన నిబంధనలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.








