వచ్చే 20 ఏళ్లు దేశానికి ఎంతో కీలకం : సీఎం చంద్రబాబు
పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్దికి చోదకశక్తి
టెక్నాలజీతో పాలనా విధానాలు మరింత సరళీకృతం
పౌరసేవల్లో నాణ్యతే సామర్ధ్యాల పెరుగుదలకు గీటురాయి
మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ తొలి సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఏపీకి మొదటి స్థానం, తదుపరి స్థానాల్లో కర్ణాటక, ఒడిశా
సీఎం చేతుల మీదుగా అవార్డులు అందుకున్న మూడు రాష్ట్రాల అధికారులు
విజయవాడ, సెప్టెంబర్ 29: దేశాభివృద్ధిలో వచ్చే 20 ఏళ్లు అత్యంత కీలకమని, ఈ కాలంలో ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలు వేగంగా మారుతున్నాయని, వాటికి అనుగుణంగా ప్రభుత్వ పాలనా విధానాలు, ప్రక్రియలు, ఉద్యోగుల నైపుణ్యాలు కూడా నిరంతరం మెరుగుపడాలని పేర్కొన్నారు. సాంకేతికతను వినియోగించుకోవడంతో పాటు పాత విధానాలు, అనవసర నిబంధనలను సరళీకరించి పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాధన శృంఖల-2026 మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు, శిక్షణ సంస్థల ప్రతినిధులు ఈ రెండు రోజుల సదస్సుకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాల మెరుగుదల, ప్రభుత్వ శిక్షణ సంస్థల సామర్థ్య నిర్మాణంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వ శిక్షణ సంస్థలు కేవలం ఉద్యోగులకు కోర్సులు నిర్వహించే కేంద్రాలుగా ఉండకూడదని సీఎం అన్నారు. సవాళ్లను పరిష్కరించడంలో ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే సంస్థలుగా అవి మారాలని సూచించారు. ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా, ఆ శిక్షణ వల్ల పాలనలో ఎలాంటి మార్పు వచ్చిందో, ప్రజలకు అందే సేవల్లో ఎలాంటి మెరుగుదల కనిపించిందో కూడా కొలవాల్సిన అవసరం ఉందన్నారు. కోర్సులు పూర్తి చేసి సర్టిఫికెట్లు పొందడం మాత్రమే కెపాసిటీ బిల్డింగ్ కాదని.. నేర్చుకున్న అంశాలను ఉద్యోగులు తమ విధుల్లో ఎంతవరకు అమలు చేస్తున్నారు. ప్రజలకు అందే సేవల నాణ్యత ఎంత మెరుగుపడుతోందన్న అంశమే ప్రామాణికత అని సీఎం స్పష్టం చేశారు.
కెపాసిటీ బిల్డింగ్ లో ఏపీకి మొదటి స్థానం
ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా మొదటి స్థానాన్ని సాధించింది. ఈ అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్, ఏపీఎస్డీపీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీఆర్ అలపర్తి అందుకున్నారు. రెండో స్థానంలో నిలిచిన కర్ణాటక, మూడో స్థానంలో నిలిచిన ఒడిశా రాష్ట్రాలకు కూడా సీఎం అవార్డులు అందజేశారు. మిషన్ కర్మయోగి కింద ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 7.89 లక్షల మంది ఉద్యోగులు ఐగాట్లో నమోదు అయ్యారని సీఎం తెలిపారు. రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా కోర్సులు పూర్తి చేసి దేశంలోని రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
రెండు కోట్ల సర్టిఫికెట్ల కంటే నేర్చుకున్న అంశాలే కీలకమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు అందే సేవల్లో మార్పుగా ఈ అంశాలు కనిపించాలని అని సీఎం అన్నారు. శిక్షణతో ఓ రెవెన్యూ అధికారి పౌరుడి సమస్యను వేగంగా పరిష్కరించటం, ఉపాధ్యాయుడు తరగతి గదిలో మెరుగైన బోధన అందించటం.. పోలీసు అధికారి మరింత మానవీయంగా స్పందించటం ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. పూర్తి చేసుకున్న శిక్షణతో పౌరులకు నాణ్యమైన సేవలు అందుతున్న తీరుకు కొలమానంగా ఉండాలని సూచించారు.
టెక్నాలజీ మారింది.. పాలనా విధానాలు మారాలి
భారత్‌లో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్నా, కొన్ని చోట్ల పాత నిబంధనలు, విధానాలు కొనసాగుతున్నాయని సీఎం అన్నారు. కంప్యూటర్లు వచ్చినా అనవసరమైన పేపర్‌వర్క్ కొనసాగడం, దరఖాస్తులను డిజిటల్ చేసినా అనేక అనుమతులు అవసరం కావడం, ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినా పౌరులను కార్యాలయాలకు రప్పించడం వంటి విధానాలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. పాత విధానాన్ని డిజిటలైజ్ చేయడం మాత్రమే ఆధునిక పాలన కాదని… మొత్తం ప్రక్రియను మార్పు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రగతిని నిరోధించే అనవసర నిబంధనలను సరళీకరించాల్సిన అవసరం ఉందన్నారు. జన్ విశ్వాస్ వంటి సంస్కరణలు ఈ దిశలో కీలకమని చెప్పారు. ప్రస్తుతం ఐటీ విప్లవం తర్వాత ఏఐ కాలం ప్రారంభమైందని, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు కూడా మారాల్సిందేనని సీఎం అన్నారు. ఏఐను కేవలం సాంకేతిక సాధనంగా కాకుండా పాలనలో నిర్ణయాలు, సమస్యల గుర్తింపు, ఉద్యోగుల నైపుణ్యాల అంచనా, శిక్షణ అవసరాల గుర్తింపులో వినియోగించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో రియల్‌టైమ్ గవర్నెన్స్ ద్వారా పాలనా వ్యవహారాలు, పౌరసేవల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. డేటా ఆధారిత వ్యవస్థలు, ఈ-ఫైలింగ్ ద్వారా నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నామని, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లను నిరంతరం పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయి అధికారులకు అవసరమైన సూచనలు ఇస్తున్నామని వివరించారు. ఏపీ ఏఐ స్టాక్, మన మిత్ర, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సాంకేతిక ఆధారిత కార్యక్రమాలను పాలనలో వినియోగిస్తున్నామని అన్నారు.
ఇవి కూడా చదవండి
మానవీయత ద్వారానే పాలనకు విలువ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలనా వ్యవహారాలను గణనీయంగా మార్చగలదని సీఎం అన్నారు. ఉద్యోగుల సామర్థ్య లోపాలను గుర్తించడం, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా శిక్షణా కోర్సులను సూచించడం, పరిపాలనా నిర్ణయాలను మెరుగుపరచడంలో ఏఐ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, యంత్రాంగం ప్రభుత్వ పాలనలో కీలకమని సీఎం అన్నారు. వరదలు, తుపాన్ల లాంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ఉద్యోగులే ముందు ఉంటారని గుర్తుచేశారు. పండుగలు, ప్రభుత్వ కార్యక్రమాలు, విపత్తుల సమయంలో కుటుంబాలను సైతం పక్కనపెట్టి ప్రజా సేవలో నిమగ్నం అవుతున్న ఉద్యోగుల సేవలను ఎప్పటికీ విస్మరించలేమని సీఎం వ్యాఖ్యానించారు. మీ ముందున్న ప్రతి ఫైలు వెనుక ఒక మనిషి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు ఉంటుంది. ప్రజలకు సేవ చేసే అవకాశం ఉద్యోగులకు లభించడం గొప్ప బాధ్యత అని సీఎం అన్నారు. ఉద్యోగులు నిరంతరం తమ నైపుణ్యాలను పెంచుకునేలా ఆన్లైన్ శిక్షణను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చూస్తూ గడిపే సమయాన్ని కెపాసిటీ బిల్డింగ్ కోసం వెచ్చిస్తే వ్యక్తిగత నైపుణ్యాలను పెంచుకోవచ్చని అన్నారు. ఐగాట్-మిషన్ కర్మయోగి ద్వారా ఉద్యోగులు ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అధికారులు, ఉద్యోగులు నిరంతర శిక్షణ పొందినప్పుడే ప్రజలకు నాణ్యమైన సేవలు అందించగలమని చెప్పారు.
శాఖల మధ్య సమాచార మార్పిడి కీలకం
ప్రభుత్వ శాఖల మధ్య నిరంతరాయంగా సమాచార పంపిణీ జరగాలని సీఎం అన్నారు. సమాచార వ్యవస్థలు పరస్పరం అనుసంధానమై ఉంటే సమస్యలను సంక్షోభంగా మారక ముందే గుర్తించి పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. సాంకేతికత, విధానాలు, ప్రక్రియలు, ఉద్యోగుల సామర్థ్యాలను సమన్వయం చేసినప్పుడే వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవచ్చని చెప్పారు. 1978లో సంస్కరణలు ప్రారంభించిన చైనా కొన్ని దశాబ్దాల్లోనే తన సామర్థ్యాలను భారీగా పెంచుకుని ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరిందని సీఎం పేర్కొన్నారు. భారత్‌లోనూ అపారమైన అవకాశాలు, వనరులు ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తమ నైపుణ్యాలను నిరూపించుకున్నారని అన్నారు. ఆర్థిక సంస్కరణల తర్వాత భారతీయుల ఆకాంక్షలు మారాయని, వాటికి అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు కూడా మారాలని సూచించారు. ప్రపంచంలోని ప్రముఖ సంస్థలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారని, ఆ సామర్థ్యాలను దేశాభివృద్ధికి వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ శిక్షణ సంస్థలు భవిష్యత్తు సవాళ్లను ముందుగానే అంచనా వేసి ఉద్యోగులను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని గుర్తించిన 61 శిక్షణ సంస్థలను ఉన్నతి కింద ఐగాట్లో అనుసంధానించామని తెలిపారు. అమరావతిలో గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏర్పాటు దిశగా కూడా పనిచేస్తున్నామని చెప్పారు.
ఏపీకి కెపాసిటీ బిల్డింగ్ పాలసీ
ఆంధ్రప్రదేశ్ కెపాసిటీ బిల్డింగ్ పాలసీని ప్రవేశపెట్టి, రాష్ట్రంలోని 38 శాఖలకు కెపాసిటీ బిల్డింగ్ ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం తెలిపారు. భవిష్యత్తులో ఉద్యోగుల సామర్థ్యాలు, నిరంతర అభ్యసనకు కెరీర్ అభివృద్ధిలో తగిన గుర్తింపు ఇవ్వాలని సూచించారు. ప్రతి ఉద్యోగికి ఎదిగే అవకాశం, ప్రతి సంస్థకు మెరుగుపడే అవకాశం, ప్రతి పౌరుడికి దాని ప్రయోజనం అందేలా వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వం నియంత్రించే వ్యవస్థగా కాకుండా ప్రజలను సాధికారత వైపు నడిపే వ్యవస్థగా మారాలని సీఎం అన్నారు. ప్రజలకు జ్ఞానం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, అవకాశాలను అందించి వారు తమ భవిష్యత్తును తామే నిర్మించుకునేలా చేయడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి దిశగా ప్రభుత్వ యంత్రాంగం సమాయత్తం కావాలని, పీ4 వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచే అవకాశం ఉందన్నారు. మిషన్ కర్మయోగి ద్వారా ఉద్యోగులు కేవలం కోర్సులు పూర్తి చేయడం కాకుండా, నేర్చుకున్నదాన్ని విధుల్లో అమలు చేయాలని సీఎం సూచించారు. లెర్నింగ్ వర్క్‌ఫోర్స్ నుంచి లెర్నింగ్ నేషన్ గా భారత్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు. 2047 వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు ప్రతీ పౌరుడి జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్ పర్సన్ రాధా చౌహాన్, సభ్యురాలు ఆల్కా, ఆ సంస్థ కార్యదర్శి జగదీప్ గుప్తా, ఏపీ ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయుష్ కుమార్, మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ కాటమనేని భాస్కర్ తదితరులు హాజరయ్యారు.








