ఆయిల్ పామ్ రంగంలో సరికొత్త భాగస్వామ్యం.. గోద్రెజ్ గ్రూప్‌తో మలేషియా మంత్రి కీలక చర్చలు
మలేషియా ప్లాంటేషన్ అండ్ కమోడిటీస్ మంత్రి వైబీ డాటుక్ సెరీ డాక్టర్ నొరైని అహ్మద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ బృందంలో మంత్రిత్వ శాఖ అధికారులు, చెన్నైలోని మలేషియా కాన్సూల్ జనరల్, పామ్ ఆయిల్ కౌన్సిల్ , బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు. ఇరువర్గాల మధ్య ఆయిల్ పామ్ ఆవిష్కరణలు, గృహోపకరణాల రంగంలో పరస్పర సహకారంపై విస్తృత చర్చలు జరిగాయి.
గోద్రెజ్ ఆగ్రోవెట్‌తో జరిగిన సమావేశంలో భారత్‌లోని వాతావరణ పరిస్థితులకు సరిపోయే అధిక దిగుబడినిచ్చే ఆయిల్ పామ్ వంగడాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అధునాతన పరిశోధనల ద్వారా ఉత్పాదకతను పెంచి, భారతదేశ దీర్ఘకాలిక ఎడిబుల్ ఆయిల్ భద్రతకు తోడ్పడే అంశాలను పరిశీలించారు. అలాగే గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌తో జరిగిన చర్చల్లో గృహోపకరణాల క్రిమిసంహారక రంగం వృద్ధికి అనుకూల వాతావరణం కల్పించడం, సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ వాణిజ్యాన్ని ప్రోత్సహించడంపై అభిప్రాయాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా మలేషియా మంత్రి నొరైని అహ్మద్ మాట్లాడుతూ, ఆర్థిక వృద్ధికి, ఆహార భద్రతకు దోహదపడే రంగాలలో భారత్‌తో తమకు బలమైన సంబంధాలు ఉన్నాయని తెలిపారు. పరిశోధన, ఆవిష్కరణలు , వాణిజ్యంలో కలిసి పనిచేసేందుకు ఈ చర్చలు చక్కటి అవకాశాన్ని కల్పించాయన్నారు. గోద్రెజ్ గ్రూప్ కార్పొరేట్ వ్యవహారాల ప్రెసిడెంట్ రాకేష్ స్వామి స్పందిస్తూ, మలేషియాతో భాగస్వామ్యం ఆయిల్ పామ్ రంగంలో శాస్త్ర ఆధారిత ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో కీలకమని చెప్పారు. ఇరు దేశాల రైతులు, వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు.








