అమెరికాలో ఎస్సార్ గ్రూప్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. స్వయంగా ప్రకటించిన ట్రంప్..
అమెరికాలో భారత్‌కు చెందిన దిగ్గజ వ్యాపార సంస్థ ఎస్సార్ గ్రూప్ (Essar Group) భారీ పెట్టుబడులు పెట్టనుంది. యూఎస్‌లో తన అనుబంధ సంస్థ మొసాబి మెటాలిక్స్ ద్వారా 15 బిలియన్ డాలర్లు (రూ.1.4 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
అయోవా రాష్ట్రంలో ఉక్కు కార్మాగార నిర్మాణానికి ఎస్సార్ గ్రూప్ ఈ భారీ మొత్తాన్ని సమకూర్చనుంది. ఈ ఉక్కు కార్మాగారం అమెరికా చరిత్రలోనే అతిపెద్దదని ట్రంప్ (Donald Trump) అభివర్ణించారు. దీనిద్వారా ప్రతి ఏటా 10 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి కానుందని చెప్పారు. దీని నిర్మాణ సమయంలో 6వేల తాత్కాలిక ఉద్యోగాలు, 2000 మందికి శాశ్వత ప్రాతిపదకన మైనింగ్, తయారీ విభాగాల్లో ఉపాధి దొరకనుందని వెల్లడించారు.
ట్రంప్ టారిఫ్ విధానాల (Trump steel tariffs) వల్లే దేశంలోకి ఈ స్థాయి పెట్టుబడులు వచ్చాయని వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ పేర్కొన్నారు. ‘‘ఈ సుంకాలే లేకపోతే ఈ కర్మాగార నిర్మాణం ఉండేదే కాదు’’ అని టారిఫ్‌లకు, పెట్టుబడులకు ముడిపెట్టారు. స్టీల్ దిగుమతులపై ట్రంప్ యంత్రాంగం 50 శాతం సుంకం విధిస్తోంది. దిగుమతులకు సుంకాలు చెల్లించే బదులు అమెరికాలో తయారీకీ కంపెనీలు మొగ్గుచూపుతున్నాయని పేర్కొంది.
ఒకప్పుడు చిన్న నిర్మాణ సంస్థగా మొదలైన ఎస్సార్ గ్రూప్… ఇప్పుడు అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. శశి రుయా, రవి రుయా అనే ఇద్దరు సోదరులు స్థాపించిన ఈ సంస్థ, అమెరికాలో ఉక్కు రంగంలో సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టబోతోంది. ఈ ప్రాజెక్టును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా చరిత్రలోనే అతిపెద్దదిగా అభివర్ణించడం దీని ప్రాధాన్యతను తెలియజేస్తోంది.
చెన్నై పోర్టు నుంచి ప్రపంచ స్థాయికి…
ఎస్సార్ గ్రూప్ ప్రస్థానం 1969లో చెన్నైలో మొదలైంది. శశి, రవి రుయా సోదరులు తమ తండ్రి నంద్ కిశోర్ రుయా వారసత్వాన్ని అందిపుచ్చుకుని, చెన్నై పోర్టులో ఔటర్ బ్రేక్‌వాటర్ నిర్మాణానికి రూ. 2.5 కోట్ల కాంట్రాక్టుతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. తమ పేర్లలోని మొదటి అక్షరాలైన ‘S’ (శశి), ‘R’ (రవి) కలిసొచ్చేలా ‘ఎస్సార్’ (Essar) అని కంపెనీకి నామకరణం చేశారు. అక్కడి నుంచి ఈ గ్రూప్ వెనుదిరిగి చూసుకోలేదు. షిప్పింగ్, స్టీల్, ఆయిల్ అండ్ గ్యాస్, విద్యుత్, పోర్టులు, టెలికాం వంటి అనేక రంగాల్లోకి విస్తరించి, ప్రపంచవ్యాప్తంగా దూకుడుగా పెట్టుబడులు పెట్టే భారతీయ సంస్థల్లో ఒకటిగా నిలిచింది.
సోదరుల్లో పెద్దవాడైన శశి రుయా గ్రూప్ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. ఆయన నవంబర్ 2024లో తన 80వ ఏట కన్నుమూశారు. ఇంజనీర్ అయిన చిన్న సోదరుడు రవి రుయా, సంస్థ కార్యకలాపాలను ఏకీకృతం చేయడంతో పాటు అమెరికా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాలకు వ్యాపారాన్ని విస్తరించడంలో ప్రధాన భూమిక పోషించారు.
ఇవి కూడా చదవండి
రుణాల సంక్షోభం నుంచి పునరుజ్జీవం
భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణ తర్వాత ఎస్సార్ గ్రూప్ వేగంగా విస్తరించినప్పటికీ, అదే స్థాయిలో భారీ అప్పుల్లో కూరుకుపోయింది. ముఖ్యంగా, ఎస్సార్ స్టీల్ ఇండియా దివాలా తీయడంతో, దానిని ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్ సంస్థకు విక్రయించాల్సి వచ్చింది. అలాగే, ఎస్సార్ ఆయిల్ సంస్థను 12.9 బిలియన్ డాలర్లకు అమ్మివేసి, ఆ వచ్చిన నిధులతో రుణ భారాన్ని గణనీయంగా తగ్గించుకున్నారు.
ఈ వ్యూహాత్మక విక్రయాల తర్వాత ఎస్సార్ గ్రూప్ ఇప్పుడు అమెరికాపై దృష్టి సారించింది. ఇప్పటికే మిన్నెసోటాలో ‘మెసాబి మెటాలిక్స్’ పేరుతో ఇనుప ఖనిజం తవ్వకాలు ప్రారంభించింది. గత 50 ఏళ్లలో అమెరికాలో మొదలైన మొట్టమొదటి కొత్త ఇనుప ఖనిజ గని ఇదే కావడం విశేషం.
తాజాగా ప్రకటించిన అయోవా స్టీల్ ప్లాంట్, ఈ మిన్నెసోటా గనుల నుంచి వచ్చే ముడిసరుకును వినియోగించుకోనుంది. ఏటా 10 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. 2030 నాటికి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రవి రుయా కుమారుడు రేవంత్ రుయా, ఇతర కుటుంబ సభ్యులు ఈ కొత్త తరం వ్యాపార కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకుంటూ సంస్థ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు.








