గ్లోబల్ ఫెర్రో-అలాయ్స్ హబ్‌గా భారత్.. స్టీల్ రంగానికి ముడిసరుకు భద్రతే కీలకం: IFAPA
భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న స్టీల్ పరిశ్రమ.. దేశీయ ఫెర్రో-అలాయ్స్ రంగానికి సరికొత్త వృద్ధి అవకాశాలను కల్పిస్తోందని ఇండియన్ ఫెర్రో అల్లాయ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IFAPA) పేర్కొంది. గోవా వేదికగా జరుగుతున్న 6వ అంతర్జాతీయ ఫెర్రో అలాయ్స్ సదస్సు (IFAC 2026)లో ఈ విషయాన్ని వెల్లడించారు. “భారత స్టీల్ వృద్ధికి ఇంధనం: ఫెర్రో అలాయ్స్ ప్రాముఖ్యత” అనే థీమ్‌తో ఈ సదస్సు కొనసాగుతోంది.
పెరుగుతున్న స్టీల్ డిమాండ్..
2025లో భారత్ క్రూడ్ స్టీల్ ఉత్పత్తి సుమారు 165 మిలియన్ టన్నులకు చేరి, ఏడాది ప్రాతిపదికన 10 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. తలసరి స్టీల్ వినియోగం కూడా 1991లో 24 కిలోల నుంచి 2025 నాటికి 109 కిలోలకు పెరిగింది. FY31 నాటికి సుమారు 300 మిలియన్ టన్నుల స్టీల్ తయారీ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో భారత్ అడుగులు వేస్తోంది. దీనివల్ల మాంగనీస్, క్రోమియం, సిలికాన్ వంటి అల్లాయింగ్ ఇన్పుట్లకు డిమాండ్ మరింత పెరగనుంది.
ముడిసరుకు భద్రతే ప్రధానం..
ప్రపంచ స్థాయిలో పోటీపడాలంటే దేశీయ ఉత్పత్తిదారులకు కీలకమైన ముడిసరుకుల స్వదేశీ వనరులను భద్రపరచడం అత్యంత ప్రాధాన్యమని IFAPA చైర్మన్ మనీష్ సర్దా స్పష్టం చేశారు. మాంగనీస్, క్రోమ్ గనుల వేలం విధానాలు కేవలం అత్యధిక బిడ్‌కే కాకుండా, వాస్తవిక గని అభివృద్ధిని ప్రోత్సహించేలా ఉండాలని కోరారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దేశీయ వనరుల లభ్యత కీలకమని తెలిపారు.
సవాళ్లు – డిమాండ్..
300 మిలియన్ టన్నుల స్టీల్ సామర్థ్య లక్ష్య సాధనకు ఇన్పుట్ ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉందని IFAPA తెలిపింది. తగిన దేశీయ గ్రేడ్లు లేని చోట మాంగనీస్ ఓర్, నోబుల్ అలాయ్స్ దిగుమతులపై జీరో డ్యూటీని అమలు చేయాలని, ఫెర్రో-అలాయ్స్ తయారీదారులకు విద్యుత్ ఛార్జీలను హేతుబద్ధీకరించాలని కోరింది. బిగ్‌మింట్ డేటా ప్రకారం.. 2025లో భారత్ ప్రపంచంలోనే మాంగనీస్ అలాయ్స్కు అగ్రగామి ఎగుమతిదారుగా నిలిచింది.
సదస్సు విశేషాలు..
గోవాలో జరుగుతున్న ఈ సదస్సుకు 700 మందికి పైగా ప్రతినిధులు, 35 మంది వక్తలు హాజరయ్యారు. ఈ వేదికపై మాంగనీస్ భద్రత, స్టీల్ డిమాండ్, గ్లోబల్ ట్రేడ్, ఇంధన సామర్థ్యం వంటి కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఎస్సార్ గ్రూప్, మోయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సెయిల్ వంటి ప్రముఖ సంస్థల సీనియర్ నాయకులు ఇందులో పాల్గొంటున్నారు. 1961లో ఏర్పాటైన IFAPA.. గత 64 సంవత్సరాలుగా ఫెర్రో అలాయ్స్ పరిశ్రమకు అపెక్స్ బాడీగా సేవలందిస్తోంది.








