ఫ్లైదుబాయ్ ఘటనతో ఉలిక్కిపడ్డ ప్రపంచం.. నిందితులను శిక్షించి తీరతామన్న ఇజ్రాయెల్..
ఫ్లైదుబాయ్ విమానం ఘటన వెనక ఉగ్రవాదమే ప్రధాన కారణమా.. అంటే అవుననే అంటోంది ఇజ్రాయెల్. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ హీరోలా అడ్డుకోకుంటే.. ఆవిమానం టెల్ అవీవ్ చేరి ఉంటే ఏం జరిగేది అన్నది ఊహించుకోవడమే భయంగా ఉందన్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఈ ఘటనను అంత తేలిగ్గా వదలమని.. దీనివెనక ఎవరున్నా విచారణ జరిపి, శిక్ష విధిస్తామన్నారు. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ కు శాల్యూట్ అన్నారు బీబీ.
ఫ్లైదుబాయ్ విమానంలో పెను ప్రమాదాన్ని అడ్డుకున్న భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై అంతర్జాతీయంగా ప్రశంసలు కురుస్తున్నాయి. మచ్చర్ నిజమైన హీరో అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అతని ధైర్య సాహసాలను ప్రశంసించారు. మరోవైపు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ.. మచ్చర్ ధైర్యసాహసాలను ప్రస్తావిస్తూ, ప్రశంసలు కురిపించారు. తీవ్రంగా గాయపడినా సమయస్ఫూర్తి, ధైర్యంతో వ్యవహరించి 9/11 తరహా విషాదాన్ని అడ్డుకున్నారని కొనియాడారు. ఢిల్లీలో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది వేడుకల్లో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బుధవారం బయలుదేరిన ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్1073 విమానంలో కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్మిత్ మచ్ఛార్‌పై దాడి చేసి కో-పైలట్ విమానాన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో విమానం ఒక్కసారిగా భారీగా కిందకు దిగొచ్చింది. దాదాపు 17,000 అడుగుల ఎత్తు ఒక్క నిమిషంలోనే కోల్పోయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వివరాలు వెల్లడించాయి.
తీవ్రంగా గాయపడిన స్మిత్ మచ్ఛార్ కాక్‌పిట్ తలుపు తెరిచేందుకు ప్రయత్నించడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లగలిగారు. అనంతరం దాడికి పాల్పడిన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో 174 మంది ఉన్నారు.స్మిత్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు భారత అధికారులు తెలిపారు.








