ఒకటి కాదు.. రెండు కాదు.. ఆరు కోట్ల కార్లు! కొనేవాళ్లు లేక మిగిలిపోయాయా?
ప్రపంచవ్యాప్తంగా కార్లకు డిమాండ్ తగ్గలేదు, కొత్తవి కొనుక్కోవాలనే కోరిక జనాల్లోనూ చావలేదు! కానీ చిత్రం ఏంటంటే.. కార్లు తయారుచేసే కంపెనీలు మాత్రం తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోతున్నాయి. దాదాపు ఆరు కోట్ల కార్లు షోరూమ్ లలో కొనేవాళ్లు లేక మూలనపడి ఉన్నాయి. ఇదో పెద్ద సమస్యగా మారి కార్ల కంపెనీలను దివాళా తీసే దిశగా తీసుకువెళ్తోంది. అసలేం జరుగుతోంది. ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ఈ కొత్త సంక్షోభం ఏమిటి..ఎక్కడుంది సమస్య?
ఖర్చులు కొండంత.. లాభాలు రవ్వంత!
కార్ల తయారీ అనేది వేల కోట్ల పెట్టుబడులతో కూడుకున్న పెద్ద వ్యాపారం. ఫ్యాక్టరీలు, యంత్రాలు, వేలమంది కార్మికులు, స్పేర్ పార్ట్స్ సరఫరా చేసే నెట్వర్క్.. వీటన్నింటికీ ప్రతినెల భారీగా ఖర్చు పెట్టాల్సిందే. ఎంత ఎక్కువగా కార్లు తయారు చేసి అమ్మితే, ఒక్కో కారుపై పడే ఈ స్థిర ఖర్చులు అంత తగ్గుతాయి. ఒకవేళ ఉత్పత్తి తగ్గితే ఆ భారం కారు ధరపై పడి కంపెనీకి దెబ్బ పడుతుంది. నిపుణుల లెక్కల ప్రకారం ఫ్యాక్టరీలు లాభాల్లో నడవాలంటే కనీసం 80 శాతం సామర్థ్యంతో పనిచేయాలి. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వీటి సామర్థ్య వినియోగం కేవలం 60 శాతానికే పరిమితమైంది. అంటే రూపుదిద్దుకున్న భారీ ప్లాంట్లలో సింహభాగం ఖాళీగా మూలుగుతున్నాయి.
దీని ఫలితంగానే గత ఏడాది ప్రపంచ ఆటోమొబైల్ రంగానికి వచ్చిన మొత్తం ఆపరేటింగ్ మార్జిన్ కేవలం 3.6 శాతం మాత్రమే. కొండంత పెట్టుబడి పెడితే గోరంత లాభం వచ్చిపడిందన్నమాట! ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ప్రపంచంలోని ఆటోమొబైల్ కంపెనీలన్నీ కలిసి ఆర్జించిన మొత్తం లాభం కంటే, ఒక్క టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఆర్జించిన లాభమే చాలా ఎక్కువని లెక్కలు తేలుస్తున్నాయి.
ఎక్కడుంది సమస్య
దీనికి ప్రధాన కారణం కార్ల అమ్మకాలు తగ్గిపోవడం ఒక్కటే కాదు.. అవసరానికి మించి కార్లను తయారు చేయగల సామర్థ్యాన్ని పరిశ్రమ పెంచుకోవడమే! ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 8.5 కోట్ల కొత్త ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవుతాయని అంచనా. కానీ ఆటోమొబైల్ పరిశ్రమకు ఏడాదికి ఏకంగా 14.2 కోట్ల వాహనాలను తయారు చేయగల సామర్థ్యం ఉంది. అంటే మార్కెట్ అవసరానికి మించి తయారీ సామర్థ్యం పేరుకుపోయింది. ఈ అదనపు సామర్థ్యమే ఆటోమొబైల్ దిగ్గజాల లాభాలను దెబ్బతీస్తోంది.
కార్లు కొనేవారు ఉన్నా, వాటిని తయారు చేసే సామర్థ్యం అవసరానికి మించి ఉండటంతో కార్లు ఎక్కువ తయారు అవుతున్నాయి. అవన్నీ మిగిలిపోతున్నాయి.
చైనా పెంచేసిన అదనపు తలనొప్పి
గత పదేళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.8 కోట్ల వాహనాల తయారీకి సరిపడా కొత్త ఫ్యాక్టరీలు రాగా, అందులో ఏకంగా 80 శాతం ఒక్క చైనాలోనే ఏర్పాటయ్యాయి. కానీ అదే పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కార్ల అమ్మకాలు మాత్రం కేవలం 50 లక్షలు మాత్రమే. అంటే మార్కెట్ పెరిగిన వేగం కంటే చైనాలో ఫ్యాక్టరీల సామర్థ్యం పెరిగిన వేగమే ఎన్నో రెట్లు ఎక్కువ.
ఇప్పుడు చైనాలో ఆటోమొబైల్ డిమాండ్ మందగించడంతో అసలు కథ మొదలైంది. అక్కడ దేశీయంగా ఉన్న డిమాండ్ కంటే రెండు రెట్లు ఎక్కువ కార్లను తయారు చేసే సామర్థ్యం తయారైంది. ఫ్యాక్టరీలు మూతపడకుండా నడవాలంటే కార్లు తయారు చేయాలి, వాటిని అమ్మ తీరాలి. దాంతో చైనా కంపెనీలు తమ దగ్గర పేరుకుపోయిన అదనపు కార్లను, తయారీ సామర్థ్యాన్ని ఇతర దేశాల వైపు మళ్లించడం ప్రారంభించాయి. తక్కువ ధరలకే కార్లను గ్లోబల్ మార్కెట్లోకి వదులుతుండటంతో ఇతర దేశాల్లోని స్థానిక కంపెనీలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
అమెరికా, యూరప్‌లలో వ్యూహాత్మక కలవరం
చైనా నుంచి ముంచెత్తుతున్న ఈ పోటీని తట్టుకోవడానికి అమెరికా, యూరప్‌లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అమెరికా ఒకడుగు ముందుకేసి చైనా కార్ల ప్రవేశాన్ని అడ్డుకునేలా కఠిన నిబంధనలు తెచ్చింది. తమ దేశీయ మార్కెట్‌ను కాపాడుకునేందుకు మెక్సికో వంటి వాణిజ్య భాగస్వాములపై కూడా ఒత్తిడి పెంచుతోంది. యూరప్ కూడా చైనా దిగుమతులపై సుంకాలు, కోటాలు విధించే ఆలోచనలో ఉంది. అయితే కేవలం ఆంక్షలు విధించినంత మాత్రాన లోపల ఉన్న అసలు సమస్య సమసిపోదు.
దీనికి అచ్చమైన ఉదాహరణ జర్మనీ పారిశ్రామిక రంగానికి గుండెకాయ లాంటి వోక్స్వ్యాగన్ (Volkswagen). తీవ్రమైన నష్టాల వల్ల ఇప్పుడు సొంత దేశంలోని ఫ్యాక్టరీలను కూడా మూసివేసే దిశగా అడుగులు వేస్తోంది. ఒక ఫ్యాక్టరీని మూసివేయడం అంటే అది కేవలం ఓ వ్యాపార నిర్ణయం మాత్రమే కాదు, దానితో వేలాది కుటుంబాల ఉపాధి, స్థానిక రాజకీయం ముడిపడి ఉంటాయి. అందుకే నష్టాలొస్తున్నా ఫ్యాక్టరీలను మూయలేక, అలాగని నడపలేక కంపెనీలుకి చెమటలు పడుతున్నాయి.
ఈ-వాహనాలొచ్చినా మారని రాత
ఇంధన కార్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు ప్రపంచం వేగంగా అడుగులు వేస్తోంది. అయితే ఈ సాంకేతిక మార్పు కొత్త అవకాశాలు తెచ్చినా, అదనపు సామర్థ్యం అనే పాత సమస్యని మరింత తీవ్రతరం చేసింది. జనరల్ మోటార్స్, ఫోర్డ్ వంటి పెద్ద కంపెనీలు తమ పాత ఫ్యాక్టరీలనే పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసుకోగలిగే ‘మిశ్రమ ఉత్పత్తి వ్యవస్థలు’గా మారుస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వాహన సామర్థ్యంలో సగానికి పైగా ఇవే ఆక్రమించాయి.
మరోవైపు ఈ-వాహనాల కోసం ప్రత్యేకంగా మళ్లీ కొత్త ప్లాంట్లు కడుతున్నారు. అంచనాల ప్రకారం 2030 నాటికి పాత పెట్రోల్, డీజిల్ ఫ్యాక్టరీల సామర్థ్యం 50 లక్షల యూనిట్లు తగ్గినప్పటికీ, కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ మరియు మిశ్రమ ఫ్యాక్టరీల సామర్థ్యం కోటి యూనిట్లకు పైగా పెరగనుంది. అంటే టెక్నాలజీ మారినా, మార్కెట్ అవసరానికి మించి కార్లు తయారు చేసే అసలు సమస్య మాత్రం అలాగే ఉండిపోతోంది.
పరిష్కారం ఏంటి? చైనాతో చేతులు కలపడమేనా?
చైనా కార్లను అమెరికా పూర్తిగా బ్యాన్ చేస్తే తాత్కాలికంగా ఉపశమనం లభించవచ్చు. కానీ దీర్ఘకాలంలో తక్కువ ధరలో లభించే విద్యుత్ వాహనాల రేసులో అమెరికా వెనుకబడిపోతుంది, పోనీ దిగుమతి లపై ఆంక్షలు కొనసాగిస్తే అమెరికా ప్రజలే ఖరీదైన కార్లను కొనాల్సి వస్తుంది. అందుకే చైనా కంపెనీలతో అమెరికా సంస్థలు జాయింట్ వెంచర్లు (ఉమ్మడి భాగస్వామ్యాలు) ఏర్పాటు చేసుకోవడమే తెలివైన మార్గమని బ్లూమ్‌బెర్గ్ సూచిస్తోంది.
ఈ వ్యూహంలో అత్యంత కీలకమైన విషయమేమిటంటే.. కొత్తగా మళ్లీ కోట్లు కుమ్మరించి ఫ్యాక్టరీలు కట్టకుండా, ఇప్పటికే తక్కువ ఉత్పత్తితో ఖాళీగా ఉన్న ప్లాంట్లను ఈ భాగస్వామ్యాలకు వాడుకోవాలి. ఉదాహరణకు స్పెయిన్‌లో సరిగ్గా నడవని ఒక ఫ్యాక్టరీని పంచుకోవడానికి ఫోర్డ్, చైనాకు చెందిన గీలీ (Geely) కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. సొంత దేశంలో డిమాండ్ తగ్గి విదేశీ మార్కెట్ల కోసం చూస్తున్న చైనా కంపెనీలకు ఇది మంచి అవకాశం. అమెరికా కూడా ఈ మార్గాన్ని ఎంచుకుంటే, చైనా అడ్వాన్స్డ్ ఈవీ టెక్నాలజీని వాడుకుంటూనే, తన దగ్గర ఖాళీగా పడి ఉన్న ఫ్యాక్టరీలకు మళ్లీ ఊపిరి పోయవచ్చు.
భారత్ పరిస్దితి ఏమిటి
సెప్టెంబర్ 2026లో భారత్‌లో కార్ల రిటైల్ అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. అయినప్పటికీ డీలర్ల వద్ద కార్ల నిల్వ 43–45 రోజుల స్థాయికి పెరిగింది. అంటే అమ్మకాలు బలంగా ఉన్నప్పటికీ, కంపెనీలు పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని సరఫరాను మరింత పెంచాయి. డిమాండ్ అంచనాలకు తగ్గట్టు లేకపోతే ఈ స్టాక్ భారం కావచ్చు
చివరగా…
ఆటోమొబైల్ రంగం ముందున్న అసలు సమస్య.. అసలు ఈ ప్రపంచానికి ఎన్ని కార్లు కావాలో, వాటి కోసం ఎన్ని ఫ్యాక్టరీలు ఉండాలో తేల్చుకోవడమే! ప్రభుత్వం ఏమో అందరికీ చౌకగా కార్లు దొరకాలంటుంది, ఫ్యాక్టరీలేమో ఉద్యోగాలు పోకుండా నడవాలంటాయి, మరోపక్క చైనా కంపెనీలు కార్లను విదేశాలకు పోటెత్తిస్తున్నాయి. ఈ సంక్షోభానికి పరిష్కారం కొత్తగా మరిన్ని కార్లను ఉత్పత్తి చేయడంలో లేదు.. ఉన్న ఫ్యాక్టరీలను సద్వినియోగం చేసుకోవడం, అవసరానికి మించిన ఉత్పత్తిని తగ్గించుకోవడం, కొత్త సాంకేతికతను పంచుకోవడంలోనే ఉందనేది స్పష్టమవుతోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








