బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు దంపతులు
కనకదుర్గమ్మకు సీఎం చంద్రబాబు దంపతులు చీర, సారె సమర్పణ
ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారికి ప్రార్థన
రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం
పట్టు వస్త్రాల సమర్పణ సమయంలోనూ సాగిన సామాన్యుల దర్శనాలు
విజయవాడ, అక్టోబర్ 16:- ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా దర్శించుకున్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు సీఎం తెలిపారు. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ ముఖ్యమంత్రికి పరివేష్టం అలంకరించారు. అనంతరం సీఎం పట్టువస్త్రాలు, సారెను అమ్మవారికి సమర్పించారు . పండితుల వేదమంత్రాల నడుమ అమ్మవారి అంతరాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం పట్టువస్త్రాలు సమర్పించే సమయంలోనూ సామాన్య భక్తుల దర్శనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా క్యూ లైన్లను కొనసాగించారు. పూజల అనంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులు సీఎం దంపతులకు వేదాశీస్సులు అందజేశారు. ఈవో శీనానాయక్ అమ్మవారి శేషవస్త్రాలను అందించగా, ఆలయ చైర్మన్, ఈవో అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.

6 రోజుల్లో 8 లక్షల మంది భక్తుల దర్శనం
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ‘రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. ప్రభుత్వం తరఫున కుటుంబ సమేతంగా అమ్మవారికి చీర, సారె సమర్పించి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించాను. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పాలక మండలి, అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆరు రోజుల్లోనే ఎనిమిది లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తిశ్రద్ధలతో తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. విజయవాడ ఉత్సవ్ 2.0, జాతీయ సరస్ మేళా కూడా ఇక్కడే జరుగుతున్నాయి. దేశంలో ప్రముఖంగా నిర్వహించే ఉత్సవాల్లో విజయవాడ దసరా ఉత్సవాలు చోటు సంపాదించుకోవడం శుభపరిణామం. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆకాంక్షించాను. ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్యకరమైన, సంపన్నమైన, సంతోషకరమైన సమాజంగా తీర్చిదిద్దాలని అమ్మవారిని కోరుకున్నాను’ అని సీఎం చంద్రబాబు అన్నారు.








