ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ (TDP) ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ నేతలు వర్ల రామయ్య(Varla Ramaiah), అశోక్బాబు(Ashok Babu) తదితరులు ఎస్ఈసీ (SEC)ని కలిసి పుంగనూరు, రాయచోటి, ధర్మవరం, తిరుపతిలో వైసీపీ సృష్టించిన విధ్వంసంపై ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద వైసీపీ కార్యకర్తలతో కలిసి లోక్సభ ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) దాడులకు తెగబడినట్లు టీడీపీ నేతలు ఎస్ఈసీకి తెలిపారు. టీడీపీ కార్యకర్తలు, ప్రజలపైకి మిథున్ రెడ్డి కాన్వాయ్ దూసుకెళ్లిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఎస్ఈసీకి అందజేశారు. అధికారులను భయభ్రాంతులకు గురి చేసేలా పెద్దిరెడ్డి కుటుంబం వ్యవహరిస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు.








