కెనడా విచ్ఛిన్నానికి అమెరికా కుట్రలు..అధ్యక్షుడు కార్నీ ఆరోపణలు..
కెనడాను ముక్కలు చేయాలని అమెరికా భావిస్తోందా.. అప్పుడే ఈజీగా తమ గుప్పిట్లోకి తీసుకోవడం వీలవుతుందని ట్రంప్ ఆలోచిస్తున్నారా.. ఇప్పుడిదే అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చ. దీనికి తెరదీసింది ఎవరో కాదు.. సాక్షాత్తూ కెనడా ప్రధాని మార్క్ కార్నీ.ఆల్బెర్టా ప్రావిన్సులో ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా కార్నీ ఈ ఆరోపణలు చేశారు.
సహజవాయువు, చమురుతో సుసంపన్నమైన ఆల్బెర్టా ప్రావిన్సు కెనడా నుంచి విడిపోవాలా వద్దా అనే అంశంపై సోమవారం ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రసంగించిన మార్క్ కార్నీ కెనడాలోనే ఆల్బెర్టా ప్రావిన్సు కొనసాగేలా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో అస్థిరత నెలకొన్న సమయంలో దేశ సరిహద్దులకు అవతల ఉన్న ఓ శక్తి కెనడాను విడగొట్టాలని చూస్తోందని మండిపడ్డారు. ఈ వేర్పాటుకు ప్రజలు ఓటేస్తే ఏళ్ల తరబడి తీవ్ర అనిశ్చితికి దారితీస్తుందని ప్రధాని హెచ్చరించారు.
ఆల్బెర్టా వనరులపై గత ప్రభుత్వ నిర్ణయాలు స్థానికుల్లో అసంతృప్తి కలిగించిన మాట వాస్తవమేనని మార్క్ కార్నీ అంగీకరించారు. కెనడాను 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామన్న ట్రంప్ బెదిరింపులకు కార్నీ కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి ఒత్తిళ్లను తట్టుకోవడానికే పసిఫిక్ లింక్ పైప్లైన్ ప్రాజెక్టును తెస్తున్నామని స్పష్టం చేశారు. దీని ద్వారా 1.40 లక్షలకు పైగా ఉద్యోగాలు రావడంతో పాటు, చమురు ఎగుమతుల కోసం అమెరికాపై ఆధారపడే అవసరం తప్పుతుందని వివరించారు. కెనడా అనుకూల వాలంటీర్లను ఉద్దేశించి మార్క్ కార్నీ మాట్లాడారు. సోమవారం నాటికి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని వాలంటీర్లను కోరారు.
‘‘ఈ ప్రజాభిప్రాయ సేకరణకు ఇంతకంటే చెత్త సమయం మరొకటి ఉండదు. మన సరిహద్దులకు అవతల ఉన్నవారు మనల్ని విచ్ఛిన్నం చేసి, గుప్పిట పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన, విభజన పూరిత వాతావరణం నెలకొని ఉంది. ఇలాంటి సమయంలో మనమంతా ఏకమై ఉండి, ఒకరికొకరు మద్దతుగా నిలబడాలి’’ అని పౌరులకు పిలుపునిచ్చారు.
మరోవైపు, అల్బెర్టా ప్రీమియర్ డానియెల్ స్మిత్ ఈ ఓటింగ్కు పిలుపునిచ్చినప్పటికీ, ఆమె కెనడాలోనే కొనసాగడానికి మద్దతుగా బుధవారం తన ఓటును వేశారు. అల్బెర్టా కెనడాలోనే ఉండాలనే దానికే తాను ఓటు వేశానని తెలిపారు.








